ఇండియా.. మరీ ఇంతటి ప్లాఫ్ షోనా..!

మనోళ్లు ఈ సారి భారీ స్థాయిలో పతకాలు సాధించబోతున్నారంటూ మీడియా హైప్ ను పెంచేయడంతో చాలా మందికి రియో ఒలింపిక్స్ మీద ఆసక్తిని పెంచుకున్నారు. సాయంత్రాల వేళ ఒలింపిక్స్ పోటీల్లో ఇండియన్ అథ్లెట్స్ పాల్గొనే ఈవెంట్ల వీక్షణకు ఉత్సాహంగా తయారైపోతున్నారు! అయితే అలా వాటిని చూస్తున్న వారికి మిగులుతున్నది నిరాశ మాత్రమే! ఇంతవరకూ ఒక్క ఈవెంట్లో కూడా మనోళ్లు పూర్తి స్థాయిలో సత్తా చాట లేదు. ప్రతి విభాగంలోనూ చాలా దారుణమైన ప్రదర్శనతో వెనుదిరుగుతున్నారు భారత ఆటగాళ్లు. భారీ అంచనాలున్న వారూ.. పేరున్న ఆటగాళ్లు కూడా ఫెయిల్యూర్ షో నే కొనసాగిస్తుండటంతో.. ఈ సారి మనోళ్లు గత ఒలింపిక్స్ స్థాయిలో అయినా పతకాలను గెలుస్తారా? అనేది అనుమానంగా మారిందిప్పుడు!

అభినవ్ బింద్రా.. ఇది వరకటి ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఈ సారి ఆయన కూడా నిరాశ పరచడంతో.. పతకాల ఖాతా తెరుస్తుందన్న ఆశలు అడియాసలయ్యాయి. షూటింగ్, ఆర్చరీలో  తొలి రోజు నుంచి క్రమం తప్పకుండా మనోళ్ల ఫెయిల్యూర్స్ కొనసాగుతున్నాయి. ఆర్చరీ టీమ్ ఈవెంట్ లో మహిళలు తొలి దశల దాటినా.. క్వార్టర్స్ నుంచి నిష్క్రమించారు!

మరో ఒలింపిక్స్ మెడలిస్ట్ గగన్ నారంగ్ ఒక విభాగంలో నిరాశ పరిచాడు. అయితే ఆర్చరీ, షూటర్ల టీమ్ ఈవెంట్స్ కథ అయిపోయినా.. వ్యక్తిగత విభాగాల్లో కొంతమంది పోటీలో ఉన్నారు. టీమ్ ఈవెంట్స్ లో వీరి ప్రదర్శన చూశాకా.. వ్యక్తిగత విభాగాల్లో వీరి మీద ఆశలు ఎంత తక్కువగా పెట్టుకుంటే అంతమంచిదనిపిస్తోంది.

ఇక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన భారత టెన్నిస్ స్టార్లు  తొలి రౌండ్ ను దాటలేకపోయారు. డబుల్స్ లో పేస్- బోపన్న జోడి, సానియా- ప్రార్థన ల జోడి.. కనీసం తొలి రౌండ్ దాటలేకపోయింది! ఇక మిక్స్ డ్ డబుల్స్ లో వీరు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. అయితే పతకాల విషయంలో ఆశలను మోస్తున్న రెజ్లర్లు  ఇంకా పోటీలో ఉన్నారు. Readmore!

హాకీ విషయానికి వస్తే.. లీగ్ రౌండ్లో ఇండియన్ టీమ్ లు పడుతూ లేస్తూ సాగుతున్నాయి. పురుషుల టీమ్ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ మీద గెలిచినా, జర్మనీతో రెండో మ్యాచ్ ఓడింది. మహిళ టీమ్ తొలి మ్యాచ్ ను జపాన్ తో డ్రా చేసుకుని, రెండో మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇలా పడుతూలేస్తూ సాగినా.. హాకీ టీమ్ లు క్వార్టర్స్ వరకూ చేరే అవకాశాలున్నాయి. అప్పుడు చూపే ప్రతిభ మీదే జాతీయ క్రీడలో దశాబ్దాల తర్వాత పతకాలు ఫలిస్తాయా.. లేదా.. అనేది ఆధారపడింది! 

అయితే... చిన్న చిన్న దేశాలు కూడా ఇప్పటికే పతకాల ఖాతాలు తెరిచి దూసుకుపోతుండగా, ఇండియా మాత్రం ఖాతానే తెరవలేదనేది బాధను కలిగించే అంశం.

Show comments