మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు దీక్ష విరమించే అవకాశాలున్నాయి. కిర్లంపూడిలో ఆయన నిరాహార దీక్ష విరమించే అవకాశముందంటూ స్వయానా ఆయన వియ్యంకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే, కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన విద్వంసానికి కారకులంటూ 13 మందిని సిఐడి అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దీక్ష ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం, ఆ 13 మంది తన కళ్ళెదుట కనిపిస్తే తప్ప దీక్ష విరమించేది లేదని చెబుతున్నారు.
మరోపక్క, ఈ కేసులో ఇప్పటికే 8 మందికి బెయిల్ రావడం, వారంతా విడుదలవడం జరిగిపోయింది. మిగిలినవారికి నేడు బెయిల్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన పక్కా సమాచారం అందడంతోనే ముద్రగడ దీక్ష విరమణపై ఆయన వియ్యంకుడు చూచాయిగా స్పష్టతనిచ్చారని అనుకోవాలి. అయితే, బెయిల్ అంశం కోర్టు పరిధిలోనిది కదా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
ఇక, ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్లు చెబుతున్నా, మూడు నాలుగు రోజుల క్రితమే ఆయనకు సెలైన్, ఫ్లూయిడ్స్ ఎక్కించేయడంతో, నైతికంగా ఆయన దీక్ష విరమించేసినట్లే లెక్క. కానీ, ముద్రగడ సన్నిహితులు మాత్రం ఆయన దీక్ష విరమించలేదని చెబుతున్నారు. ప్రభుత్వం తరఫునుంచి ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి స్పష్టత ఇంకా కొరవడుతోంది. బీపీ, డయాబెటిస్ వ్యాధులతో బాధపడుతున్న ముద్రగడ, ఇన్ని రోజులపాటు నిరాహార దీక్ష చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తే తప్ప ఇలాంటి దీక్షలు సాధ్యం కావన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన.
మొత్తమ్మీద, ముద్రగడ దీక్ష కాపుల రిజర్వేషన్ కోసం కాకుండా, ఆ రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో భాగంగా చోటు చేసుకున్న విధ్వంసం.. ఆ విధ్వంసానికి బాధ్యులైనవారిని అరెస్ట్ చేస్తే.. ఆ అరెస్టుల్ని నిరసిస్తూ కావడం ఆశ్చర్యకరం. ప్రభుత్వం కనుసన్నల్లో అత్యంత పకడ్బందీగా, అత్యంత సీక్రెట్‌గా ముద్రగడ పద్మనాభం దీక్ష జరుగుతుండడం చూస్తోంటే.. ఇదంతా కాపుల అభ్యున్నతి కోసమేనా.? అంటే, చెప్పడం కష్టమే.