బస్తీ మే సవాల్‌: ట్యాపరింగ్‌ చేసే దమ్ముందా.?

ఎన్నికల కమిషన్‌ సవాల్‌ విసిరింది. 'బస్తీ మే సవాల్‌' అంటోంది. మే 1 నుంచి ఎవరైనాసరే, ఈవీఎం ట్యాంపరింగ్‌ చేసి చూపించాలంటూ ఎన్నికల కమిషన్‌ విసిరిన సవాల్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఎన్నికల ప్రక్రియలో 'ఈవీఎం' (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌) అత్యంత కీలక భూమిక పోషిస్తోంది. గతంలో 'బ్యాలెట్‌' గుద్దుడు ఎంత అధ్వాన్నంగా వుండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో పోల్చితే, ఈవీఎం విప్లవాత్మక మార్పుల్ని ఎన్నికల ప్రక్రియలో తీసుకొచ్చిందన్నది నిర్వివాదాంశం. 

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి, క్యూ లైన్లలో నిల్చుని, విత్‌డ్రాల్‌ ఫామ్‌ నింపి, గంటల తరబడి మళ్ళీ ఎదురుచూస్తే, అప్పుడుగానీ చేతికి డబ్బులొచ్చేవి కాదు. ఇప్పుడలా కాదు, ఏటీఎంకి వెళితే డబ్బులొచ్చేస్తున్నాయి. అఫ్‌కోర్స్‌, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇప్పుడు ఏటీఎంలు 'నో క్యాష్‌' బోర్డులతో ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. మరో విషయాన్నీ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒకప్పుడు ఫోన్‌ కాల్‌ అంటే, అది ట్రంక్‌ కాల్‌ రూపంలోనే. గంటల తరబడి, రోజుల తరబడి ట్రంక్‌ కాల్‌ కోసం ఎదురుచూడాల్సిన రోజులు పోయి, లైవ్‌గా ఫోన్‌లో చూస్తూ మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి. సాంకేతికంగా ఇంతటి విప్లవాత్మక మార్పుల్ని మనం చూస్తున్నాం. 

అద్భుతమైన సాంకేతిక విప్లవంలో, 'ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌' అన్న పదాలకీ చోటుంది. అలా ఇలా కాదు, బ్యాంకు అకౌంట్లలోని నగదు గల్లంతవుతోంది.. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లలో డేటా హ్యాక్‌ అవుతోంది. ఎంతగా భద్రతా చర్యలు తీసుకుంటున్నాసరే, హ్యాకింగ్‌, ట్యాంపరింగ్‌కి హద్దూ అదుపూ లేకుండా పోయింది. అంతెందుకు, ఏటీఎంలను హ్యాక్‌ చేసేస్తున్నారు కొత్తగా. దాంతో ఏటీఎం కార్డు పెట్టకుండానే కుప్పలు తెప్పలుగా నగదు వచ్చేస్తున్న ఉదంతాల్ని చూస్తున్నాం. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఈవీఎంని చూసి సాంకేతిక అద్భుతం.. అని మురిసిపోతున్న మనం, అది ట్యాంపరింగ్‌ అయితే జరిగే అనర్ధాల్ని మాత్రం లైట్‌ తీసుకుంటున్నాం. ఎన్నికల కమిషన్‌ బహు గొప్పగా, ట్యాంపరింగ్‌పై సవాల్‌ విసిరేస్తోందిగానీ, గతంలోనే ట్యాంపరింగ్‌ ఇలా చేయొచ్చని కొందరు నిపుణులు నిరూపించేశారు. అలా వాస్తవాన్ని చూపినవారికి 'జైలుశిక్ష'ని బహుమతిగా ఇచ్చార్లెండి.  Readmore!

మొత్తం అన్ని ఈవీఎంలనూ ట్యాంపరింగ్‌ చేయడం వీలు కాకపోవచ్చు, కానీ కొన్ని ఈవీఎంలు అయినా ట్యాంపరింగ్‌ అవుతాయి కదా.! ఆ కొన్నీ ఫలితాల్ని తారుమారు చేసేయడం పెద్ద వింతేమీ కాదు. అవి ట్యాంపరింగ్‌ అయితే, వాళ్ళెలా గెలుస్తారు.? అన్న చర్చ తెరపైకొస్తోంది. ఇక్కడే అసలు మతలబు దాగి వుంది. ఈ గోలంతా ఎందుకు, ఈవీఎంకి ప్రింటర్‌ని అటాచ్‌ చేస్తే, ఓటరు తానెవరికి ఓటేశాడో తెలిసిపోతుంది కదా.? అన్న వాదనా లేకపోలేదు. దాన్నెవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. 

ఒక్కటి మాత్రం నిజం. శాటిలైట్లను హ్యాక్‌ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఎక్కడో అమెరికాలో వుండి, ఇండియాలోని కంప్యూటర్‌ని కొల్లగొడుతున్న హ్యాకర్లు తయారయ్యారు. అలాంటిది, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ని ట్యాంపరింగ్‌ చెయ్యలేరా.? ఇంత చిన్న లాజిక్‌ని ఎన్నికల కమిషన్‌ ఎలా మిస్‌ అవుతోందబ్బా.? ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో, ప్రకటనలు ఇచ్చేసి, అక్కడ సామాన్యులెవరూ రాకుండా చేసేసి, 'అయిపోయింది' అనిపించేసినట్లే, ఈవీఎంలపై 'బస్తీ మే సవాల్‌' కూడా 'మమ' అన్పించేయనుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్‌.

Show comments

Related Stories :