అవమానాలే.. దిగమింగుకోక తప్పదు.!

కేఈ కృష్ణమూర్తి.. పేరుకి ఉప ముఖ్యమంత్రి. టీడీపీ సీనియర్‌ నేత కూడా. కానీ, ఏం లాభం.? పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. ఇప్పుడేదో కొత్తగా 'చినబాబు' నారా లోకేష్‌, కేఈ కృష్ణమూర్తిని నిలదీసేశారు కాబట్టి.. కేఈ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చిందనీ, ఆయనపై ఆయన అనుచరులు సింపతీ ప్రదర్శిస్తున్నారనీ, ప్రతిపక్షాలూ ఆయనపై సింపతీ ప్రదర్శించే పరిస్థితి వచ్చిందనీ అనుకుంటే పొరపాటే. 

వాస్తవానికి కేఈ కృష్ణమూర్తి 'వేరే దారి లేక' టీడీపీలో చాలాకాలంగా సర్దుకుపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది మొదలు, ఆయన పరిస్థితి పార్టీలో పూర్తిగా మారిపోయింది. ఉప ముఖ్యమంత్రి పదవి అంటేనే 'ఆరో వేలు' అనే అభిప్రాయం వుంది. అది ఎందుకూ పనికిరానిదని అర్థం. కొన్ని ముఖ్యమైన శాఖలు ఆయన కింద వున్నా, ఏ శాఖకు సంబంధించిన పని అయినా ఆయన తనంతట తానుగా చేయలేని పరిస్థితి. 

రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర కేఈ కృష్ణమూర్తిదే అయి వుండాలి. కానీ, ఆయన అసలు రాజధాని విషయాల్నే పట్టించుకోరు. కారణం అందరికీ తెల్సిందే, అదే.. మంత్రి నారాయణ పెత్తనం. తన శాఖ మీద కూడా నారాయణ పెత్తనం చేస్తోంటే, మొదట్లో ప్రశ్నించారుగానీ.. చంద్రబాబు నుంచి తనకు సరైన మద్దతు లేక, నారాయణకి చంద్రబాబు మద్దతు పెరగడం, అదే సమయంలో చంద్రబాబు నుంచి తనకు చీవాట్లు ఎదురవడంతో మౌనంగా వుండిపోయారు కేఈ కృష్ణమూర్తి. 

నారాయణకి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలే కాదు, లోకేష్‌తోనూ అదే తరహా సంబంధాలున్నాయి. ఇవి ఆర్థిక పరమైన సంబంధాలనే ఆరోపణలు లేకపోలేదు. దాంతో, కేఈ కృష్ణమూర్తి ఆటోమేటిక్‌గా నారాయణ ముందు తగ్గాల్సి వచ్చింది. నారాయణ కంటే పదవి పెద్దదే అయినా, ముందే చెప్పుకున్నాం కదా 'ఆరో వేలు' అన్నట్లుగా ఆ పదవి ఎందుకూ పనికిరాకుండా పోయింది.  Readmore!

ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తి ఎందుకు మౌనంగా వుంటున్నారట.? సమాధానం సింపుల్‌.. వేరే దారి లేక. రాజ్యసభ ఎన్నికల సమయంలో కూడా కేఈ కృష్ణమూర్తి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఆయనగారి సూచనల్ని, సలహాల్ని కనీసం పట్టించుకోలేదు చంద్రబాబు. ఇంతలా కేఈ కృష్ణమూర్తి టీడీపీలో, టీడీపీ ప్రభుత్వంలో కరివేపాకు అయిపోయాక లోకేష్‌ ఏం ఖర్మ, ఎవరైనాసరే.. ఆయన్ని లైట్‌ తీసుకోకుండా వుండగలరా.? ఎమ్మెల్యేలే కాదు, కింది స్థాయి నేతలూ డిప్యూటీ సీఎంని లెక్క చేయడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, కేఈ కృష్ణమూర్తి పదవి వుండి, ఆ పదవి తాలూకు దర్పం ప్రదర్శించలేని దయనీయ స్థితిలో వున్నారనడం నిస్సందేహం.

Show comments

Related Stories :