పివోకేపై సర్జికల్‌ స్ట్రైక్స్‌.. చేసేశాం.!

కుక్క కాటుకి చెప్పుదెబ్బ తగలాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పాకిస్తాన్‌ పదే పదే, తీవ్రవాదుల్ని భారత్‌పైకి ఉసిగొల్పుతుండడం, సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్తుండడంతో రెండు దేశాల మధ్యా యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం విదితమే. సహనమే భారత్‌ శాంతి మంత్రం.. అని ఎన్నిసార్లు చెబుతున్నా, కుక్క తోక వంకర నైజం పాకిస్తాన్‌ది. ఇక ఇలా కాదని, సర్జికల్‌ స్ట్రైక్స్‌కి తెరలేపింది భారత్‌. 

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు తీవ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగినట్లు విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ తరఫున అధికారిక ప్రకటన వెల్లడయ్యింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ని నిర్వహించడంతోపాటు, పాకిస్తాన్‌కి ఈ విషయమై సమాచారం కూడా అందించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటే వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన లక్ష్యాలపైకి దాడులు చేయడం. అత్యంత నైపుణ్యతతో మాత్రమే ఈ దాడులు సాధ్యమవుతాయి. పారాట్రూపర్స్‌ని ఇందుకోసం వినియోగించడం జరుగుతుంది. చాలా సీక్రెట్‌ ఆపరేషన్‌ ఇది. ఎంపిక చేసిన శిబిరాలపై వ్యూహాత్మక దాడులు చేయడం ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ముఖ్య ఉద్దేశ్యం. అయితే, సర్జికల్‌ స్ట్రైక్స్‌కి భారత్‌ తెగబడితే, అణ్వస్త్రాలు ప్రయోగించడానికి వెనుకాడబోమంటూ ఇప్పటికే పాక్‌ హెచ్చరించింది. 

పాక్‌ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ, యురిలో సైన్యంపై తీవ్రవాదులు జరిపిన దాడులకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్నట్లే భావించాలి. ఇక, సర్జికల్‌ స్ట్రైక్స్‌లో ఎంతమంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టిందీ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవానికి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమయ్యాయనీ, పెద్ద సంఖ్యలో తీవ్రవాదులు మృతిచెంది వుంటారనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. 

మొత్తమ్మీద, యురి ఎటాక్‌కి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న దరిమిలా, ఇప్పుడు సరర్జికల్‌ స్ట్రైక్స్‌పై పాకిస్తాన్‌ స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

కొసమెరుపు: ఇటీవలి కాలంలో మయన్మార్ తీవ్రవాద శిబిరాలపై మాత్రమే భారత్ అధికారికంగా సర్జికల్ స్ర్ట్రైక్స్ జరిపింది. 

Show comments