హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. తర్వాతేంటి?

అది ఉందని కూడా ఇన్నాళ్లూ ఎవరికీ తెలియదు. ఆ పార్టీని ఏర్పాటు చేసిన హరికృష్ణ ఎప్పుడో తిరిగి తెలుగుదేశంలో చేరిపోయాడు. అయితే ‘అన్న తెలుగుదేశం’ పార్టీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. హరికృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు.. ఆ పార్టీ తరపున ఒకసారి రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్ పెద్ద కుమారుడికి ఆ ఛాన్స్ రాలేదు!

ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలోనే ‘అన్న తెలుగుదేశం’ పార్టీ గుర్తింపును ఈసీ రద్దు చేయడం విశేషం. రాజకీయంగా యాక్టివ్ గా లేని పార్టీలు ఆర్థిక అవినీతికి మార్గాలుగా నిలుస్తున్నాయన్న భావనతో ఈసీ వాటన్నింటినీ రద్దు చేసింది. వీటిల్లో తెలుగు రాజకీయాలకు సంబంధించిన మూడు ప్రముఖుల పార్టీలున్నాయి.

ఒకటి హరికృష్ణ పార్టీ, రెండోది లక్ష్మీ పార్వతి స్థాపించుకున్న పార్టీ, మూడోది దివంగత ఇంద్రారెడ్డి  ఏర్పాటు చేసుకున్న జై తెలంగాణ పార్టీ… వీటిల్లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరుణంలోనే తన పార్టీని విలీనం చేసినట్టుగా ప్రకటించారు. అయితే.. పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రం అలాగే ఉండింది. దాన్ని ఈసీ రద్దు చేసింది.

ఇక లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైకాపా నేత. టీవీ చర్చా కార్యక్రమాలకు ఆమె వైసీపీ ప్రతినిధి హోదాలోనే వస్తుంటారు. ఆమె పార్టీ రిజిస్ట్రేషన్ ను కూడా ఈసీ రద్దు చేసింది.

Readmore!

ఇక హరికృష్ణ విషయానికి వస్తే.. ప్రస్తుతానికి ఆయన బోలెడంత అసంతృప్తితో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో తగు గౌరవం దక్కడం లేదు. పార్టీ అధికారంలో ఉన్న వేళ.. ఎలాంటి ప్రాధాన్యతనూ పొందలేకపోతున్నాడు నందమూరి హరికృష్ణ. అయితే ఈ అసంతృప్తిని బయటకు వ్యక్తపరచకుండా గుంభనంగా ఉన్నాడు.

కేవలం హరికృష్ణ ఒక్కడే అయ్యుంటే అదో కథ. ఆయనకు మెరికల్లాంటి ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు సినీ ఇండస్ట్రీపై తన ముద్రను కలిగిన వాడు. ఇంతటి నేపథ్యం ఉన్నా.. చరిత్ర నాదే, వర్తమానమూ నాదే.. అని చెప్పుకునే అవకాశం ఉన్నా.. తెలుగుదేశంలో మాత్రం హరిని పూచికపుల్లగా తీసిపడేస్తున్నారు!

తెలుగుదేశం వారసత్వం విషయంలో హరి తనయుడు తారక్ కు కూడా ఎలాంటి ప్రాధాన్యమూ లభించడం లేదు. ఇతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా చంద్రబాబు, లోకేష్ లు లెక్కచేయడం లేదు! ఏతా వాతా ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి ప్రభావం చూపించలేని స్థితిలో ఉన్నారు వీళ్లు.  ఇలాంటి సమయంలోనే.. హరికృష్ణ పార్టీ రిజిస్ట్రేషన్ ను ఈసీ రద్దు చేయడం వీరి రాజకీయ అచేతన స్థితిని తెరపైకి  తెచ్చింది! మరి హరికృష్ణ ఆయన తనయులు రాజకీయ ప్రస్థానం లో తర్వాతేంటో! 

Show comments