'ఆన్‌లైన్‌'లో జనసేన.. పవన్‌ ఏం చేస్తున్నాడట.?

కొత్తగా ఆన్‌లైన్‌లోకి జనసేన పార్టీ వచ్చిందట. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌తోపాటుగా, యూ ట్యూబ్‌ ఛానల్‌ని కూడా జనసేన పార్టీ ప్రారంభించిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, జనసేన పార్టీ కబుర్లు.. అన్నీ ప్రజలకు చేరువయ్యేలా చేయడానికే ఈ ప్రయత్నమట. అదిరిందయ్యా పవ్‌కళ్యాణూ.! 

అవును మరి, చాలాకాలం క్రిందట జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌, ట్విట్టర్‌లోకి అడుగు పెట్టారు. ప్చ్‌, ఆ ట్విట్టర్‌ పిట్ట కొత్తల్లో నాలుగైతు 'కూతలు' కూసి, ఆ తర్వాత సైలెంటయిపోయింది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌, ట్విట్టర్‌ నుంచి ఎలాంటి సందేశాలూ ఎవరికీ ఇవ్వట్లేదు. అసలు, పవన్‌కళ్యాణ్‌కి రాజకీయాలపై సీరియస్‌నెస్‌ వుంటే కదా.! ప్రజారాజ్యం పార్టీ యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా పనిచేశారు, ఆ తర్వాత ఎన్నికలయ్యాక సైలెంటయిపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా.? 

2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణ్‌, వీరావేశంతో ప్రసంగాలు చేశారు. అఫ్‌కోర్స్‌, వీరావేశానికి పేటెంట్‌ హక్కులు ఆయన వద్దే వున్నాయేమో.! ఆ ఆవేశం పబ్లిసిటీ స్టంట్స్‌కే పరిమితమవుతోంది. బహిరంగ సభలు పెట్టినా, ఆకస్మికంగా 'షోస్‌' చేసినా (అమరావతిలో చేశార్లెండి) ఇవన్నీ, పొలిటికల్‌ స్టంట్లుగానే మారిపోయాయి. ప్రత్యేక హోదా కోసమంటూ తిరుపతి, కాకినాడల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ షరామామూలే. 

అసలు జనసేన పార్టీ ఏంటి.? ఆ పార్టీలో పవన్‌కళ్యాణ్‌ తర్వాత ఎవరు.? పవన్‌కళ్యాణ్‌ కాకుండా ఎవరు.? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా సమాధానం లేదు. ఒక సిద్ధామంటూ లేకుండా, రెండున్నరేళ్ళపాటు పార్టీని నడపగలిగారంటే ఇది ఆల్‌ టైమ్‌ రికార్డ్‌గా చెప్పుకోవచ్చేమో. ఇప్పుడిక ఆన్‌లైన్‌లోకి వచ్చి, తమ పార్టీకి ఏం సిద్ధాంతాలున్నాయని జనసేన చెప్పగలుగుతంది.! 

Show comments