మోడీ మహనీయుడి దెబ్బకు సీమ రైతు అబ్బా..!

ఈ ఏడాది మకర సంక్రాంతికి మోడీ సర్కారు చాలా గ్రాండ్‌గా ప్రారంభించిన కార్యక్రమం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. పంటలపై భారీగా పెట్టుబడులు పెట్టి.. ఒక్కోసారి పండీ, మరోసారి పండక నష్టపోతున్న రైతులను ఉద్ధరించడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టుగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. మన దగ్గర సంక్రాంతి జరుపుకునే రోజున ఈ పథకాన్ని ప్రకటించారు. సంక్రాంతికి పంటల పండుగ అనే పేరుంది కాబట్టి ఈ పథకాన్ని ఆ రోజున ప్రారంభించారు. ఈ రకంగా అయితే సెంటిమెంటును బాగానే పడించింది మోడీ ప్రభుత్వం.

అది కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం కాదు. దీంట్లో రాష్ర్ట ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. అలాగని ఇదేదో సంక్షేమ కార్యక్రమం ఏమీకాదు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల కన్నా ఇందులో ప్రధానమైన వాటా రైతులది. రైతుల నుంచి ప్రతి యేటా పంటల బీమా కోసం డబ్బులు కట్టించుకుని, కొంతమొత్తాన్ని రాష్ర్ట ప్రభుత్వం, మరికొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేసి.. ఇన్సూరెన్స్ కంపెనీలకు కడతాయి. ఈ బీమా సొమ్ము పంట పోయిన సందరా్భల్లో క్లైమ్ అవుతుంది.

వాస్తవానికి ఇది ఏ మాత్రం కొత్త కార్యక్రమం కాదు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న కార్యక్రమమే. అయితే రైతుల కోసం ఏదో చేశామని హడావుడి చేయడానికి మోడీ సర్కారు దీనికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పేరు పెట్టి, లోక్‌సభలో ఈ విషయాన్ని గొప్పగా ప్రకటించుకుని, ప్రచారం కోసం పేపర్లకు ప్రకటనలు ఇచ్చి.. హడావుడి చేసింది. వెనుకటికి యూపీఏ హయాంలో కూడా ఇదే తీరున పంటల బీమా పథకం అమలయ్యేది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ వాటాగా కొంత మొత్తాన్ని జమ చేయగా.. రైతులపై ప్రధాన భారం మోపీ.. పంటలకు ఇన్సూరెన్స్ చేయించేవారు. కించిత్ కూడా తేడా లేకుండా ఇదే పథకాన్ని పునఃప్రారంభించింది మోడీ సర్కారు. చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్టుగా వ్యవహరించడం మన రాజకీయ నేతలకు కొత్త కాదు కదా! మోడీది కూడా అదేదారి.

మరి ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ భీమా యోజనకు, వెనుకటికి యూపీఏ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు అమల్లో ఉన్న భీమా యోజనకు ఒక ప్రధానమైన తేడా ఉంది. ఈ తేడా రైతులను ఉద్ధరించేదైతే కాదు.. ఈ  తేడా రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లను అమితంగా బాధపెడుతుంది. దీన్ని సోదాహరణంగా వివరించాలి అంటే... రాయలసీమ ప్రాంతంలో ఈ పంట బీమా పథకం అమలవుతున్న తీరును చెప్పాలి.

సీమ జిల్లాల్లో ప్రధానమైన పంట వేరుశనగ. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తతంగా సాగు చేసే పంట ఇది. ఈ పంట పూర్తిగా రుతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. సకాలంలో వర్షాలు వస్తే, రోగాల పీడ లేకపోతే పంట చేతికి వస్తుంది. లేకపోతే కనీసం పశుగ్రాసం కూడా దక్కదు. పెట్టుబడుల విషయానికి వస్తే.. భారీగానే అవుతాయి. ప్రస్తుత ధరల్లో ఎకరాలో వేరుశనగ విత్తాలంటే పదిహేను వేల రూపాయల వరకూ ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత ఎరువు, పంట సంరక్షణ.. పంట బాగా అయితే చెట్లు, వాటి కాయలు పీకడం.. దీనికయ్యే ఖర్చు వేరే. ఈ పంట సాగు విషయంలో అష్టకష్టాలూ పడుతూ కూడా రాయలసీమ రైతాంగం దీని మీదే ఆధారపడే పరిస్థితి ఉంది. అత్యంత విస్తతంగా సాగయ్యే ఈ పంట విషయంలో ప్రభుత్వ వ్యవహారాలు కూడా రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

వేరుశనగ పంట నష్టపోయిన సమయాల్లో ప్రభుత్వం ఆదుకోవడం అనేది ఇక్కడ రైతుల జీవనగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇన్‌పుట్ సబ్సిడీలు క్రాప్ ఇన్సూరెన్స్‌లు ఎన్నో రైతుల మాన ప్రాణాలను కాపాడేశక్తి కలిగి ఉన్నాయి. ఈ విషయంలో వైఎస్ హయాం ఒక స్వర్ణయుగం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు భీమా పరిహారం ఇచ్చి ఆదుకుంది. పంట నష్టం అంచనాలను సరిగా వేసి.. ఇన్సూరెన్స్ సంస్థలకు పరిస్థితిని అర్థమయ్యేలా చేసి.. రైతులకు పంట బీమా దేక్కలా చేసింది వైఎస్ ప్రభుత్వం. ఒక దశలో 100శాతం ఇన్యూరెన్స్ పొందిన మండలాలు కూడా ఉన్నాయి. కావాలంటే రికార్డులు పరిశీలిస్తే.. 2005 నుంచి 2010ల మధ్య వేరుశనగ ఇన్సూరెన్స్ ఏ స్థాయిలో ప్రకటించారో అర్థం అవుతుంది.

ఇక వైఎస్ ఉన్నంత వరకూ పంట పోయినా.. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సీడీలు రైతులకు మనోబలాన్ని ఇచ్చాయి. ఇక ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌ల హయాంలో అరకొర పరిహారం వచ్చింది. రైతులు ఇన్సూరెన్స్‌కు డబ్బులు కట్టినా అదో ప్రయోజనం లేని పనిగా మిగిలింది. ఇక చంద్రన్న సీఎం అయ్యాక కూడా చెప్పుకోవడానికేమీ లేదు. గత రెండు సంవత్సరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ సమస్యే లేదు! కేంద్ర ప్రభుత్వం ఏదో ఇన్‌పుట్ సబ్సీడీ నిధులిస్తే రుణమాఫీ పుణ్యమా అని వాటిని కూడా బ్యాంకులు రైతులు కట్టాల్సిన బాకీలోకి జమచేసుకున్నాయి. నిజానికి ఇన్‌పుట్ సబ్సీడీ నిధులను కూడా చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాలోకి జమచేయాలని భావించింది. కానీ బ్యాంకులు అందుకు సమ్మతించకపోవడంతో రైతులకు ఆ మాత్రం అయినా ప్రయోజనం దక్కింది.

ఇదంతా జరుగుతున్న తరుణంలో నరేంద్రమోడీ మహనీయుడి ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన ఫసల్ బీమా యోజన రాయలసీమ రైతాంగానికి మరో షాక్! రోశయ్య, కిరణ్, చంద్రబాబుల కన్నా.. గొప్ప ట్విస్టు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. తను ఎంత గుండెదీసిన బంటునో మోడీ మరోసారి నిరూపించుకున్నాడు. ఈయన మేధస్సుకు ప్రతిఫలంగా ప్రారంభమైన ఈ బీమాయోజన పరిధిలో.. వేరుశనగ పంటకు స్థానమే లేదు!

సీమ రైతులకు ప్రధాన పంట వేరుశనగ.. గుజరాత్‌కు ధీటుగా దేశంలో వేరుశనగ సాయ్యేది రాయలసీమ నాలుగు జిల్లాలలోనే. ఇక్కడి రైతుల జీవనశైలిలో భాగం వేరుశనగ. అలాంటి పంటను ఈ ప్రాంత పరిధిలో ఇన్సూరెన్స్ పరిధి నుంచి తప్పించారు!

ఇదీ మోడీ మహనీయుడి ఘనత. ఇదొక గొప్ప పథకం.. రైతుల జీవితాలను ఉద్ధరించే పథకం అంటూ.. కోట్ల రూపాయలు పెట్టి ఫసల్ భీమా యోజన పథకం గురించి ప్రచారం చేస్తూనే.. ఈ పథకం పరిధి నుంచి వేరుశనగను తప్పించి.. రైతులకు ట్విస్ట్ ఇచ్చారు! మరి.. ముఖ్యమైన పంట అది.. దాన్ని భీమా పరిధి నుంచి తప్పించి.. రైతులను ఉద్ధరించడం మోడీ ప్రభుత్వం ప్రత్యేకత! ఇక వేరుశనగ పంటపోతే ఇన్సూరెన్స్ వస్తుంది అనే సమస్యే లేదు. ఈ పంట సాగుకూ భీమాకు సంబంధం ఉండదంతే!

అయితే.. రైతుల నుంచి భీమా కోసం డబ్బులైతే గట్టిగా వసూలు చేస్తున్నారు. ఎకరాకు దాదాపు ఆరేడువందల రూపాయల వరకూ భీమాకి అంటూ వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ భీమా వేరు శనగకు కాదంట.. కంది పంటకు, అంతర పంటలుగా వేసుకునే ఉలవలకు, అలసందలకు! ప్రధాన పంటను వదిలి పెట్టి.. అంతర పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్‌లు ఇస్తాం.. డబ్బులు కట్టండి అంటూ రైతుల నుంచి తప్పనిసరిగా భీమాకు డబ్బులు కట్టించుకొంటున్నారంటే.. ఈ ప్రభుత్వాలను ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు రాయలసీమ రైతులకు.

అధికారులకు అవగాహన లేదా? ప్రధాన పంటను భీమా పరిధి నుంచి తప్పించేసి.. అంతర పంటలకు భీమా కట్టించుకుంటున్నామే. దీని వల్ల రైతులకు వచ్చే ఉపయోగం ఏమిటి? అనేది వాళ్లకు తెలీదా? ఇక ప్రజాప్రతినిధులు పందులకు పళ్లు తోముతున్నారా? తమ ప్రాంతంలో ఏ పంట సాగు చేస్తారు.. ఏ పంటకు భీమా కల్పించాలి.. అనే అంశంపై వీరికైనా ప్రాథమిక అవగాహన ఉండదా? రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించి ఈ పథకాన్ని సరిదిద్దే ఆలోచన ఒక్కడికైనా లేదా? ఇదంతా గమనిస్తూ ఆలోచిస్తే ఎందుకు రైతుల జీవితాలతో ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఆడుకుంటారో అర్థంకాదు.

జీవన్ రెడ్డి.బి

Show comments