ప్రాధాన్యం తగ్గినట్లా?...పనిభారం తగ్గినట్లా?

'పాత ఒక రోత...కొత్త ఒక వింత'...అనే నానుడి మనకు తెలుసు. పాత రోత కాకపోవచ్చు, కొత్త వింత కాకపోవచ్చు. కాని కాలానుగుణంగా వ్యవస్థల్లో మార్పులు చేసుకోవడం అవసరం. సమాజం ఎలా మారుతూ ఉంటుందో దానికి అనుగుణంగా ఆలోచనలు మారాలి. ప్రభుత్వాల పనితీరు మారాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా సమాజాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు వ్యవస్థలనూ మార్చాలి.  పాత వ్యవస్థను మారిస్తే ఏదో కొంపలు మునిగిపోతాయని భయపడటం, కొత్త వ్యవస్థ ప్రజలకు వంద శాతం ప్రయోజనం కలిగిస్తుందని సంతోషపడటం అనవసరం. 

పాత వ్యవస్థను మెరుగుపరిచి లేదా రద్దు చేసి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తరువాత లోపాలను సమీక్షించుకొని ముందుకు పోవాలి. వాస్తవానికి మన దేశంలో బ్రిటిష్‌ పాలనా కాలంలోని వ్యవస్థల్లో కొన్ని ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  ఒక దేశం మరో దేశ పాలకుల నుంచి స్వాతంత్య్రం సంపాదించుకున్న తరువాత తన సొంత వ్యవస్థలను, విధానాలను ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్న దేశాలు అనేకమున్నాయి. కాని స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇండియాలో ఇంకా అనేక పాత (బ్రిటిష్‌) వ్యవస్థలను పాలకులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందుకు పోలీసు శాఖను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఈ శాఖలో బ్రిటిష్‌ హయాంనాటి పెత్తందారీతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ని సంస్కరణలు అమలు చేస్తున్నా 'జులుం' తగ్గడంలేదు. కిందిస్థాయి పోలీసులను పై అధికారులు తమ ఇంటి పనులకు, సొంత ప్రయోజనాలకు ఇంకా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. బ్రిటిష్‌ కాలంనాటి ఈ అవశేషం ఇంకా కనబడుతూనే ఉంది. నాయకులకు ప్రొటోకాల్‌ విధానం, వివిధ శాఖల్లో నిబంధనలు ఇంకా బ్రిటిష్‌ హయాంనాటివే కొనసాగుతున్నాయి. వీటిని సమూలంగా మార్చాల్సిన అవసరముంది. 

బ్రిటిష్‌ హయాం నాటి అనేక పనికిమాలిన చట్టాలు చాలా అమల్లో ఉన్నాయని, వాటిని రద్దు చేయడం మంచిదని అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే నరేంద్ర మోదీ సర్కారు అభిప్రాయపడింది. రద్దు ఆలోచన బాగానే ఉన్నా ఈ విషయంలో పెద్దగా ముందుకుపోయిన దాఖలాలు లేవు. 92 ఏళ్లనాటి పాత విధానం ఒకటి ఇప్పుడు రద్దు కావడం మోదీ పరిపాలనలో చెప్పుకోదగ్గ విశేషం. అదే...రైల్వే బడ్జెట్‌.  ఈ బడ్జెటును ప్రత్యేకంగా ప్రవేశపెట్టే విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 2017 నుంచి రైల్వే బడ్జెటును సాధారణ బడ్జెటులో భాగం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం ఇందుకు అంగీకారం తెలపడంతో 1924 నుంచి అమల్లో ఉన్న రైల్వే బడ్జెటు విధానం శాశ్వతంగా రద్దయిపోయింది.

రైల్వే బడ్జెటును విడిగా సమర్పించాలా? సాధారణ బడ్జెటులో కలిపేయాలా? అనేది నిర్ణయించడానికి ఇద్దరు సభ్యులతో నియమించిన కమిటీ రద్దు చేయడం మంచిదని సిఫార్సు చేయడంతో కేంద్రం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు కూడా తన అంగీకారం తెలియచేశారు. వచ్చే బడ్జెటు నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి సాధారణ బడ్జెటు ప్రసంగంలోనే రైల్వేకు సంబంధించిన అంశాలుంటాయి. రైల్వేకు సంబంధించిన లెక్కలు డొక్కలు, పథకాలు వగైరా ఆ శాఖ అధికారులే తయారుచేసి ఆర్థిక అందిస్తుండవచ్చు. మన దేశంలో పార్లమెంటు బడ్జెటు సమావేశాలు సుదీర్ఘంగా జరుగుతుంటాయి. 

సాధారణ బడ్జెటుకు ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. సాధారణ బడ్జెటు, రైల్వే బడ్జెటు సమర్పిస్తారు. అంటే మొత్తం మూడు భాగాలన్నమట. ఈ మూడు కూడా అత్యంత కీలకమైనవి కాబట్టి మీడియా, ప్రజలు, వ్యాపార, పారిశ్రామికవర్గాలవారు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇక నుంచి రైల్వే బడ్జెటు కోసం ఎదురుచూపులుండవు. ఇక్కడొక అనుమానమొస్తోంది. విడిగా రైల్వే బడ్జెటును రద్దు చేసినందువల్ల రైల్వే మంత్రికి ప్రాధాన్యం తగ్గుతుందా? లేదా పనిభారం తగ్గుతుందా? కేంద్రంలో ఆర్థిక శాఖ తరువాత రైల్వే శాఖ కీలకం. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఈ రెండు శాఖల కోసం భాగస్వామ్య పార్టీలు పట్టుపడుతుంటాయి. 

రైల్వే శాఖ కోసం తీవ్రమైన లాబీయింగ్‌ జరుతుంది. ఈ శాఖను నిర్వహించిన మంత్రులు వారి స్వరాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చుకున్న చరిత్ర చాలా ఉంది. ఇకమీదట సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు రైల్వే కోసం లాబీయింగ్‌  ఉండకపోవచ్చు. రైల్వే బడ్జెటును సాధారణ బడ్జెటులో విలీనం చేసినా ఆ శాఖ ప్రాధాన్యం తగ్గదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. దాని స్వయంప్రతిపత్తికి ఢోకా లేదన్నారు. కాని రైల్వే మంత్రి నామమాత్రం అయ్యే ప్రమాదముందని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తొమ్మిది దశాబ్దాల సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడటం విశేషం. 

Show comments