నాయనమ్మ బర్త్‌డే ఆమెకు మంచి ముహూర్తం...!

ప్రజలకు సెంటిమెంట్లు ఎక్కువ. ఇక రాజకీయ నాయకులకైతే చెప్పక్కర్లేదు. అడుగు తీసి అడుగు వేస్తే ముహూర్తాలు చూసుకోవల్సిందే. నాయకులకు మంచి ముహూర్తాలు చెప్పడానికి పర్మినెంటుగా ఫ్యామిలీ పౌరోహితులు, జ్యోతిష్యులు వగైరా ఉంటారు. వారి సలహాల ప్రకారమే ఈ నాయకులు నడచుకుంటారు. సాధారణంగా ముహూర్తాలంటే తిథులు, వారాలు, నక్షత్రాలు మొదలైనవి చూసుకొని నిర్ణయిస్తుంటారు. కాని అందరికీ ఈ నమ్మకాలు ఉండవు కదా. అలాంటివారు కూడా ఏదో ఒక మంచి రోజు చూసుకొని అంటే తాము మంచిది అనుకున్న రోజు చూసుకొని పని ప్రారంభిస్తారు. 

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి ప్రధాన ప్రచారకర్త అయిన  సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా మంచి ముహూర్తం, మంచి ప్రదేశం చూసుకొని తన ప్రచారం ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి ఆమె ఎప్పుడో ప్రచారం ప్రారంభించాల్సింది. అప్పుడు ప్రారంభిస్తారు...ఇప్పుడు ప్రారంభిస్తారంటూ వార్తలొచ్చాయి. కాని ఇప్పటివరకు మొదలు కాలేదు. అనేక తర్జనభర్జనల తరువాత ముహూర్తం నిర్ణయించారు. ఎప్పుడు? నవంబరు 19 నుంచి  యూపీలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని నాయకులు చెబుతున్నారు. ఆ తేదీకి అంత ప్రాముఖ్యమేమిటి? దాని ప్రాధాన్యం సామాన్యమైంది కాదు. ఆ తేదీ దివంగత ఇందిరా గాంధీ జన్మదినం. 

గొప్ప ప్రధానిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆమె ప్రియాంకకు నాయనమ్మ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రియాంకను మరో ఇందిరగా చెబుతుంటారు. ఎందుకు? దాదాపు నాయనమ్మ మాదిరిగానే ఉంటుంది కాబట్టి. ప్రియాంక కోణంలో చూస్తే నవంబరు 19 మంచి ముహూర్తమనే చెప్పాలి. ఇక ఆమె ప్రచారం ప్రారంభించే ప్రదేశం కూడా సెంటిమెంటుతో కూడిందే. నెహ్రూ-గాంధీ వంశీకులు తరతరాలుగా నివసించిన భవనం, దేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన భవనమైన అలహాబాదులోని ఆనంద్‌ భవన్‌ నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు. 

ఆనంద్‌ భవన్లో నాయనమ్మకు, తండ్రికి, పూర్వీకులందరికీ నివాళులర్పించిన తరువాత ప్రియాంక ప్రచారానికి బయలుదేరతారు. ఆమె రూట్‌ మ్యాపును నాయకులు తయారుచేస్తున్నారు. కాంగ్రెసు బలంగా ఉన్న వంద నియోజకవర్గాలను నాయకులు గుర్తించారు. మొదటి దశలో యాభై నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలూ తీసుకోవడానికి ఆమె అంగీకరించడంలేదని సమాచారం. ప్రధానంగా సోదరుడు రాహుల్‌ను బలోపేతం చేయాలని, ఆదరించాలని ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేయబోతున్నారు. 

ఆమె ఒంటరిగానే ప్రచారం చేస్తుందని, ఎక్కడా తల్లితోగాని, సోదరుడితోగాని వేదికను పంచుకోదని నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ రూపొందించిన పోస్టర్లలో, ఫ్లెక్సీల్లో సోనియా, రాహుల్‌తో సమంగా ప్రియాంకకూ ప్రాధాన్యం ఇచ్చారు. నియోజకవర్గాలవారీగా సమస్యలను నాయకులు ప్రియాంకకు అందచేశారు. ఆమె వాటిని అధ్యయనం చేసి తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తారు.  సోనియా గాంధీ ఏ ముహూర్తం చూసుకొని (చూడకపోవచ్చు కూడా) ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో  ప్రచారం (రోడ్‌ షో) ప్రారంభించారోగాని విఘ్నం కలిగింది. 

ఆమెకు హఠాత్తుగా అనారోగ్యం కలగడం, ఆ సందర్భంగా కిందపడి భుజానికి గాయం కావడంతో దానికి ఆపరేషన్‌ చేయడం తెలిసిందే. సోనియా రోడ్‌ షో మధ్యలోనే ఆగిపోవడం కాంగ్రెసు శ్రేణులకు నిరాశ కలిగించింది. అధినేతకు ఏమీ కాకుండా ప్రచారం కొనసాగివుంటే కాంగ్రెసు కేడర్‌కు ఉత్సాహం కలగడమే కాకుండా ఇతర పార్టీలకూ తొందరపడాలనే ఆలోచన కలిగేది. ప్రచారం దీర్ఘకాలం ఆగిపోతే ఉత్సాహం సన్నగిల్లుతుందేమోనని యూపీ కాంగ్రెసు నాయకులు ఆందోళన పడ్డారు. సాధ్యమైనంత త్వరగా సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ చేత ప్రచారం మొదలుపెట్టించాలనుకున్నారు. 

సోనియా రోడ్‌ షో అర్ధంతరంగా ఆగిపోయింది కాబట్టి అదే రోడ్‌ షోతో ప్రియాంక ప్రచారం ప్రారంభిస్తారని చెప్పారు. కాని అనుకున్నట్లు కాలేదు.  గోరఖ్‌పూర్‌ నుంచి సెప్టెంబరులో తొలి ప్రచారం   (రోడ్‌ షో) ప్రారంభిస్తారని  గతంలో  చెప్పారు. సోనియా గాంధీ రోడ్‌ షోకు అసాధారణమైన స్పందన వచ్చిందని, కాబట్టి ప్రియాంకతోనూ ఎక్కువ రోడ్‌ షోలు చేయించాలని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. 

రోడ్‌ షోలు పార్టీకి అనుకూల వాతావరణం కల్పిస్తాయని, ప్రాణవాయువులా ఉపయోగపడతాయని నాయకుల అభిప్రాయం. బహిరంగ సభల కంటే ఇవి ఎక్కువ మేలు చేస్తాయన్నారు. కాని సోనియా ప్రచారం తరువాత చాలా విరామం వచ్చింది. ఈమధ్యలో రాహుల్‌ కిసాన్‌ యాత్ర ప్రారంభించి పార్టీ కేడర్‌కు ఉత్సాహం కలిగించారు. ఆ యాత్ర అక్టోబరు నెలాఖరుకు పూర్తవుతుంది. 

Show comments