పాక్ ఓవరాక్షన్: బాలీవుడ్ కు ఇప్పుడు సిగ్గొస్తోందా!

మేం కళాకారులం.. శాంతి ప్రవచనకారులం.. అని పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు బాలీవుడ్ సినీ ప్రముఖులు. పాకిస్తానీ యాక్టర్ల, ఇతర కళాకారుల విషయంలో ఎమ్ఎన్ఎస్ స్పందించిన తీరుపై ఓ మొత్తం బాలీవుడ్ బాలీవుడ్డే  రియాక్ట్ అయిపోతోంది. కనీసం బోర్డర్ లో సైనికులు చనిపోతేనే, దేశంలో ఉగ్రవాదులు మారణకాండను సృష్టిస్తేనో మాట్లాడటానికి తీరికలేని వాళ్లు కూడా పాకీ యాక్టర్ల విషయంలో రియాక్ట్ అయిపోతున్నారు. వాళ్లను దేశం వీడి వెళ్లమనడం న్యాయం కాదని వీళ్లు గొంతు చించుకుంటున్నారు.

మరి ఏమైంది? ఇప్పుడు.. బాలీవుడ్ కు సిగ్గు వచ్చినట్టేనా? “ఎమ్ఎస్ ధోనీ’’ సినిమాపై పాక్ లో అప్రకటిత నిషేధం నడుస్తోంది. ఈ సినిమాను అక్కడ విడుదల చేయకూడదని పాకిస్తానీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారట. అదేమంటే.. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ సినిమాతో మాకు పని లేదు అని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.

చాలా.. చెప్పుతో కొట్టినట్టుగా లేదూ ఈ స్పందన? ఎవరైతే పాకిస్తానీ నటీనటుల తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారో, వాళ్లకు పాకిస్తానీ డిస్ట్రిబ్యూటర్లు చెప్పుతో కొట్టి చూపించారు. తమది ధనియాల జాతి అని. 

వీళ్లేమో కళాకారులం.. శాంతి.. నిషేధాలు వద్దు అంటుంటే, వాళ్లు “ఉద్రిక్త పరిస్థితుల’’ కారణంగా హిందీ సినిమాను విడుదల చేసేదే లేదని ప్రకటించారు. ‘ఎమ్ఎస్ ధోనీ’ సినిమాకు పాకిస్తానేమీ ఆర్థిక వనరు కాదు కానీ, ఇండియా విషయంలో పాకిస్తానీయులు ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ సినిమాపై వారు విధిస్తున్న నిషేధం రుజువు.

కరణ్ జొహార్, సైఫ్ అలీఖాన్, సల్మాన్ లాంటి వాళ్లు .. పాకిస్తానీ నటీనటుల తరపున పోరాడుతున్నారు కదా, మరి ఇప్పుడు ధోనీ సినిమాను అక్కడ నిషేధించడంపై వీళ్లు స్పందించగలరా? శాంతి, కళ.. అంటూ దౌత్యం చేసి, ధోనీ సినిమాపై వీరు నిషేధం ఎత్తేయించగలరా? వీళ్లకు అంత సీనుందా? లేకపోతే.. సదరు పాకిస్తానీ కళాకారులు అయినా, ధోనీ సినిమాపై నిషేధం వద్దు, సినిమాను సినిమాగా చూద్దాం, కళను కళగా చూద్దాం.. అని మాట్లాడగలరా?

ఎమ్ఎన్ఎస్ ను అన్ని సందర్భాల్లోనూ  సమర్థించలేకం కానీ, “సిరియాలోనో, ఇరాక్ లో ఉగ్రవాద దాడులు జరిగితే చలించిపోయే ఇండియాలోని పాకిస్తానీ కళాకారులు.. కశ్మీర్ లో, సరిహద్దులో ఉగ్రవాదకాండలను ఎందుకు ఖండించడం లేదు? సిరియాలో బాధితుల పట్ల ట్వీట్ల ద్వారా మీరు వ్యక్త పరిచే జాలిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విషయం లో ఎందుకు కనబరచరు?’’అంటూ ప్రశ్నిస్తోంది ఆ రాజకీయ పార్టీ.

చాలా సింపుల్ గా.. లాజికల్ గా ఎమ్ఎన్ఎస్ పాకిస్తానీ ‘కళాకారులను’ ప్రశ్నిస్తోంది. మీదేశం ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మీరు ఖండించండి.. హ్యాపీగా ఇండియాలో ఉండండి అని అంటోంది. మరి ఈ కళాకారులకు ఆ మనసు లేదు కదా? వీళ్లను ఎందుకు దేశంలో ఉంచుకుని పోషించాలి? ఎందుకు సమర్థించాలి?

Show comments