అది 'అమ్మ' గొంతా?... అపోలో సృష్టా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠత ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్‌ రామస్వామి అనే సామాజిక కార్యకర్త జయలలిత ఆరోగ్య పరిస్థితిపై 'అసలు సంగతి' తెలియచేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. ఆ పిల్‌ను ఈ రోజు (మంగళవారం) విచారణకు స్వీకరించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 'జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎల్లుండికల్లా (గురువారం) నివేదిక విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేసేది లేదంటూ కర్నాటక సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించినట్లుగా తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. 

అమ్మ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక విడుదల చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కోర్టులో వాదించింది. కాని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఏం జరుగుతుందో చూడాలి. ఇక మరో విశేషం జరిగింది. జయ ఆరోగ్య పరిస్థితిపై వివరించాలనే డిమాండ్‌ ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెరుగుతుండటంతో ప్రభుత్వం అపోలో ఆస్పత్రి ద్వారా  ఈ రోజు జయ గొంతును ప్రజలకు వినిపించింది. అంటే జయతో మాట్లాడించి, రికార్డు చేసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టింది. రెండు నిమిషాల పదహారు సెకండ్లున్న ఈ వీడియో మీద  'చీఫ్‌ మినిస్టర్‌ జయలలిత వాయిస్‌ ఫ్రమ్‌ అపోలో హాస్పిటల్‌' అని ఉంది. ఆమె తమిళంలో మాట్లాడారు. తన ఆరోగ్యస్థితి, చేస్తున్న చికిత్స వగైరా వివరించారు. 

మొత్తం మీద తాను బాగానే ఉన్నాననేది ఆమె మాట్లాడినదాని సారాంశం. యూట్యూబ్‌లో ఈ వీడియో చూసి ఆమె గొంతు విన్న తమిళులు  'అది అబద్ధపు గొంతు' (ఫేక్‌ వాయిస్‌) అని కామెంట్స్‌ పెట్టారు. ఇదంతా అపోలో సృష్టి అని కొందరు, ఆమె గొంతు ఎలా ఉంటుందో తమకు తెలుసునని కొందరు...ఇలా అనేక రకాల కామెంట్స్‌ పెట్టారు. 'నేను అమ్మను మీ జయలలితను మాట్లాడుతున్నాను' అని చెప్పడం విశేషం. అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందని, ఈ వాయిస్‌పై అనుమానాలున్నాయని కొందరు చెబుతున్నారు. అపోలో ఆస్పత్రి ఇన్నాళ్లు సరైన హెల్త్‌ బులిటన్లు విడుదల చేయలేదనే విమర్శలున్నాయి.

 ఇప్పటిరకు రెండుసార్లో మూడుసార్లో విడుదల చేసిన బులిటన్లలో ఎలాంటి వివరాలు లేవు. 'ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారు. కోలుకుంటారు'...ఇంతకు మించి చెప్పలేదు.  అయితే మొదటిసారిగా ఈరోజు విడుదల చేసిన బులిటన్లో ముఖ్యమంత్రి ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా, కృత్రిమ శ్వాస అందిస్తున్నామని అపోలో బులిటన్‌ తెలియచేసింది. కొన్ని తమిళ టీవీ ఛానెళ్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వికటన్‌ టీవీ 'గవర్నర్‌ అపోలోకు వచ్చిన రోజు ఏం జరిగింది?' అంటూ కథనం ప్రసారం చేసింది. 

ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు జయలలితను చూసి ఆమె క్షేమంగానే  ఉన్నారని చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కాని ఆయన ఆమెను చూడలేదని వికటన టీవీ తెలియచేసింది. జయను చూసేందుకు ఆస్పత్రి వర్గాలు ఆయన్ను అనుమతించలేదట. చూడొద్దని కూడా సలహా ఇచ్చారట. ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి ఆయనతో కేవలం నాలుగు నిమిషాలే మాట్లాడారట. ముంబయి నుంచి సాయంత్రం చెన్నయ్‌ వచ్చిన విద్యాసాగర్‌ రావు వాస్తవానికి అరగంటకు మించి చెన్నయ్‌లో లేరు. ఇక లండన్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ కూడా వెళ్లిపోయారని తెలిపింది.  వికటన్‌ టీవీ తన కథనంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. 

తమిళ ఛానెళ్లు జయ ఆరోగ్య పరిస్థితిపై జ్యోతిష్యులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తమిళనాడు జ్యోతిష్యులతోపాటు  విదేశీ జ్యోతిష్యులూ చర్చల్లో పాల్గొంటున్నారు.  ఇక జనం పూజలు, ప్రార్థనల సంగతి సరేసరి. ఒంటికి శూలాలు పొడుచుకోవడంవంటి భయంకరమైన పనులు కూడా చేస్తున్నారు. కొందరు ఆస్పత్రి ఎదురుగానే పూజలు చేస్తున్నారు. మహిళల ఏడుపులు మిన్నంటుతున్నాయి. కొందరు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 

ప్రభుత్వ పాలన దాదాపు స్తంభించిపోయిందని కొందరు చెబుతున్నారు. మంత్రులంతా ఆస్పత్రి లోపలో, బయటో పడిగాపులు పడుతున్నారు. చాలామంది అధికారులూ ఆస్పత్రి దగ్గరే ఉంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా, ఆందోళనకరంగా ఉంది. 

Show comments