అనుకున్నంతా అయ్యింది మారుతీ

ఒక్కసారిగా దర్శకుడు మారుతి క్రిటిక్స్ కు టార్గెట్ అయిపోయారు. భలే భలే మగాడివోయ్ సినిమా సమయంలో ఏ క్రిటిక్స్ అయితే మారుతిని నెత్తిన పెట్టుకున్నారో, వాళ్లంతా ఇప్పుడు రోజులు మారాయి సినిమా విషయంలో ఆయననే టార్గెట్ చేస్తున్నారు. కేవలం కథ కథనాలు తనవి తప్ప, మరే విధంగానూ ఆ సినిమాతో సంబంధం లేదు అని ఆయన అన్నా కూడా వినే పరిస్థితిలో ఇప్పుడు ఎవరు లేరు.

దగ్గరి జనాలు ముందే అభిమానంతో చెప్పారు..దర్శకుడు మారుతితో..పరిస్థితి ఇలాంటి వస్తుందని. కానీ ఆయన వెర్షన్ వేరు. తను జస్ట్ కథ, స్క్రీన్ ప్లే మాత్రమే ఇచ్చాను..తనకేంటీ సంబంధం అని. కానీ మీడియా, సినిమా అభిమానులు అలా అనుకోరు. పైగా సినిమా జనాలు కూడా తమ సినిమాకు సేలబుల్ ఐటమ్ ఏముందా అనే చూస్తారు. అందుకే మారుతి ప్రెజెంట్స్ అన్నది టైటిల్స్ కార్డ్స్ లో ఒకటికి రెండు మెరుపులు మెరిపించి మరీ చూపించారు. దానికి కారణం ఇవ్వాళ జనంలో మారుతి పేరుకు వున్న క్రేజ్. 

ఇక్కడ సమస్య ఏమిటంటే..మారుతి ఒకేసారి పది పనులు చేయాలనుకుంటారు. ఒకేసారి పది మందికి పది ఆదేశాలు ఇస్తూ టైమ్ ను పూర్తిగా వాడేసుకోవాలనుకుంటారు. కానీ అక్కడ పది పనులు సవ్యంగా జరుగుతున్నాయా లేదా అన్నద గమనించేంత తీరుబాటు లేదు ఆయనకు. అదే సమస్య. కథ లైన్ కొత్త దర్శకుడికి చెప్పి వుండొచ్చు. సీన్లు చెప్పి వుండొచ్చు. దీన్ని ఆయనే స్వయంగా పెన్ను పట్టుకుని పేపర్ పై పెట్టేంత టైమ్ వుండి వుండదు. వాళ్లు రాసింది జస్ట్ అలా చూసి సరే అని వుండొచ్చు..బాగానే విజువలైజ్ చేస్తారు అనుకని వుండొచ్చు. కానీ చివరకు ఫలితం ఇదీ. 

అలాంటపుడు తన పేరు డ్యామేజ్ అవుతుందని మారుతి అనుకోకుంటే ఏలా? సుకుమార్ లాంటి డైరక్టర్ యూత్ ఫుల్ సినిమా పేరిట బూతుఫుల్ సినిమాగా కుమారి 21 ఎఫ్ ను తీసి వుండొచ్చు. కానీ దాంట్లో కథ, కథనాలు వున్నాయి. సరైన నటులు వున్నారు. వాళ్లనుంచి మంచి నటన రాబట్టారు. అవన్నీ కలిసి ఇటు కుర్రాళ్లను లాగేసాయి..సినిమా లవర్స్ ను లాగేసాయి. అవన్నీ గమనించకుండా, తనను మాత్రమే బూతు డైరక్టర్ అంటే ఎలా అని మారుతి వగచి లాభం లేదు.

భలే భలే సక్సెస్ వచ్చిన తరువాత మారుతి పేరు మొత్తం మారిపోయింది. టాప్ డైరక్టర్లలో ఒకరు అన్న రేంజ్ కు వెళ్లిపోయారు. మరి ఆ పేరును కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తగా వుండాలి. కానీ అలా ఎందుకు చేయడం లేదో? రోజులు మారాయి సినిమా చూసిన వారికి కాని, క్రిటిక్స్ కు కానీ అది మారుతి సినిమాగానే ప్రొజెక్ట్ అయింది తప్ప, వేరుగా కాదు.. హిట్ అయి వున్నా కూడా ఆ క్రెడిట్ మారుతికే దక్కేది కానీ వేరొకరికి కాదు. 

అందుకే అద్దాల మేడలో వున్నవాళ్లు చాలా జాగ్రత్తగా వుండాలి.అందమైన మేడ తమకు వుందని సంబరపడితే సరిపోదు..ఎవరు రాయి వేస్తే ఏమవుతుందో అన్న భయమూ వుండాలి. అలా రాళ్లు తమ వైపు రాకుండా తమ జాగ్రత్తలు తామూ తీసుకోవాలి. అంతే కానీ, రాళ్లేసే అవకాశం తామే ఇవ్వకూడదు.ఇప్పటికైనా నో వర్రీ..బాబు బంగారం హిట్ అయితే మళ్లీ మారుతి అక్కౌంట్ బ్యాలెన్స్ అవుతుంది. అది ఆయన చేతుల్లోనే వుంది.

Show comments