సోనియాజీ...జైరామ్‌ నిజాలు చెప్పారు..!

ప్రాంతీయ పార్టీల్లో నాయకులెవరూ అధినేతకు ఎదురు చెప్పరు. అధినేత తానా అంటే వీరు తందానా అంటారు. ఒకరిని మించి మరొకరు భజన చేస్తారు. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెసులోనూ ఇదే పరిస్థితి దశాబ్దాలుగా ఉంది. పేరుకు అది జాతీయ పార్టీ అయినా ఎక్కువగా ప్రాంతీయ పార్టీ లక్షణాలే ఉన్నాయి. ఈ లక్షణాల్లో భజన చేయడం ఒకటి. నాయకులు పార్టీకి విధేయులుగా ఉండాలి. కాదనం. కాని ఎవరైనా భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే 'ద్రోహి' కింద పరిగణిస్తారు. కాంగ్రెసులో ప్రధాన మంత్రయినా, ముఖ్యమంత్రులైనా సోనియా గాంధీ అడుగులకు మడుగులొత్తాల్సిందే. 

ఆమె ఏం చెప్పినా బ్రహ్మాండం, అద్భుతం అనాల్సిందే. అయితే అప్పుడప్పుడు కొందరు కాంగ్రెసు నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. సాదాసీదా నాయకులైతే అధిష్టానం ఏమంటుందోనని భయపడతారుగాని 'సరుకు' ఉన్న వారు ధైర్యంగానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అలాంటి అతి తక్కువమందిలో ఈమధ్య జైరామ్‌ రమేష్‌ కనబడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన జైరామ్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉంటూనే విభజనలో కీలక పాత్ర పోషించారు. అనేక అంశాల మీద పుస్తకాలు రాసిన ఈ నాయకుడు రాష్ట్ర విభజన గురించి రాసిన 'ఓల్డ్‌ హిస్టరీ-న్యూ జియోగ్రఫీ' పుసక్తం ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ఇది తెలుగులోకి కూడా అనువాదమైంది. 

ఈ సందర్భంగా మాట్లాడిన జైరామ్‌ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెసు పార్టీ సెల్ఫ్‌ గోల్‌ (ఆత్మహత్య అనొచ్చు) చేసుకుందని అన్నారు. ఇది వాస్తవమే కదా. తెలంగాణ ఇచ్చినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోగా క్రమంగా వలసల కారణంగా మరింత బక్కచిక్కిపోయింది. ఆంధ్రాలో గత ఎన్నికల్లో భూస్థాపితమైంది. వచ్చే ఎన్నికలనాటికి బలం పుంజుకుంటామని ఆంధ్రా కాంగ్రెసు నాయకులు అనుకుంటున్నారు. కాని అది సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అలనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చినా, వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవించివున్నా తెలంగాణ రాకపోయేదని జైరామ్‌ అన్నారు ఇదీ వాస్తవమే. 

సోనియా గాంధీకి ఇష్టం లేని అపర చాణక్యుడిగా పేరుమోసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును జైరామ్‌ ప్రశంసించారు. పీవీ సంస్కరణలను సమర్ధిస్తూ పుస్తకం కూడా రాశారు. ఆయన పరిపాలన దేశాన్ని మలుపు తిప్పిందన్నారు. పీవీని ప్రశంసిస్తే సోనియాకు నచ్చదు. అందుకే మన తెలుగు కాంగ్రెసు నాయకులు (రెండు రాష్ట్రాల్లో) పీవీని బహిరంగంగా ప్రశంసంచారు. కాని జైరామ్‌ సభలోనే ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంచితే...ఇప్పుడు ప్రియాంక గాంధీపై కాంగ్రెసులో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి చర్చంటూ ఏమీ లేదు. 

ప్రియాంక క్రియాశీలక పాత్ర పోషిస్తేనే, బాధ్యతలు తీసుకుంటేనే కాంగ్రెసు బతికి బట్ట కడుతుందని కాంగ్రెసు నాయకులు ముక్తకంఠంతో చెప్పడమే కాకుండా ప్రియాంక కోసం డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెసును పునరుజ్జీవింపచేయడానికి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శక్తి సరిపోదనేది నాయకుల అభిప్రాయం. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. కొన్ని కారణాలతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ప్రకటించి ప్రియాంకకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. 

అయితే ప్రియాంక కారణంగా కాంగ్రెసు పార్టీ బతికి బట్ట కడుతుందని, పునరుజ్జీవం పొందుతుందనేది 'ఒట్టి మాట' అని జైరామ్‌ రమేష్‌ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కేవలం వ్యక్తుల కారణంగా పార్టీ పునరుజ్జీవం పొందే అవకాశం లేదన్నారు. నాయకులందరి సమష్టి కృషి కారణంగానే పునరుజ్జీవం సాధ్యమవుతుందని చెప్పారు. 'వ్యక్తి మంత్రదండం కాదు' అని రమేష్‌ సూటిగా చెప్పారు. ఈ వాదన సంప్రదాయ కాంగ్రెసు నాయకుల అభిప్రాయాలకు భిన్నమైంది. కాంగ్రెసు పార్టీ నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల కారణంగానే, వారి ఆకర్షణ శక్తి వల్లనే మనుగడ సాగిస్తోందని వారంటారు. 

వారి నాయకత్వం లేని కాంగ్రెసును వారు ఊహించలేరు. ఏ పార్టీకైనా వ్యక్తిగత ఆకర్షణ కొంతమేరకు ఉపయోగపడుతుంది. కాని సమష్టి కృషి లేకుండా పార్టీ మనుగడ సాధ్యమవుతుందా? కాని టీమ్‌ వర్క్‌ భావనను కాంగ్రెసు అధిష్టానం అంగీకరించదు. సోనియా, రాహుల్‌, ప్రియాంక...వీరు ముగ్గురే కర్త, కర్మ, క్రియ. దీన్ని కాదన్నవారు పాపాత్ములే. మరి జైరామ్‌ రమేష్‌ పాపాత్ముడేనా? 

Show comments