ఎన్నికలపై మాట మార్చిన బాబు

ఆ మధ్య చంద్రబాబు ఓ మాట అన్నారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే బెటర్. ప్రతి మూడ్నెల్లకు ఓ సారి ఏదో ఎన్నికలకు వెళ్లడం బాగా లేదన్నారు. ఆ తరువాత మళ్లీ మరో మాట అన్నారు. స్థానిక ఎన్నికలు అన్నీ సార్వత్రిక ఎన్నికల తరువాతే అని ఆయన ప్రకటించారు. 2014లో రోశయ్య, కిరణ్ కుమార్ ల టైమ్ లో వరుసపెట్టి, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరిపేసారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే. ఇది అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశానికి కలిసి వచ్చింది.

సార్వత్రిక ఎన్నికల ముందు లోకల్ బాడీ ఎలక్షన్ లు జరిపిస్తే, రిజల్ట్ తో సమస్య వచ్చే అవకాశం వుందని భావించి చంద్రబాబు అలా అని వుంటారని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ బాబుగారే మరో మాట అన్నారు. మహానాడు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇక వరుసగా ఎన్నికలే ఎన్నికలు అని ప్రకటించేసారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరుగతాయని ఆయన చెప్పారు.

ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు జరపాలనుకోవడం, పైగా ఎన్నకలు జరుపుతా అని ముందుగా ప్రకటించడం వెనుక వైనం ఏమై వుంటుందా అని రాజకీయ పరిశీలకులు లెక్కలు కడుతున్నారు. ఏతా వాతే తేలిన ఫలితం ఏమిటంటే, పార్టీలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న లుకలుకలే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇంక అంతా సైలెంట్ అవుతారు.

ఎందుకంటే అందరికీ పోటీ అవకాశం కావాలి. గడబిడ చేస్తే, చంద్రబాబు కు కోపం వస్తుంది. అందుకే సైలెంట్ అవుతారు. పైగా స్థానిక ఎన్నికల్లో కీలక పదవులకు పోటీ చేసేది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల తాలూకా బంధుజనమే. అందువల్ల ఇక్కడ కొందరికి టికెట్ ఇస్తే, ఎమ్మెల్యే ఎన్నికల టైమ్ లో అవసరం అయితే చెక్ పెట్టొచ్చు. ఈ ఫలితాలు చూపించి బాగుంటే ఓకే లేదంటే, వద్దనుకున్నవాళ్లను సాగనంపవచ్చు. ఇలా అన్నీ ఆలోచించే బాబు ఇలా మాట మార్చి వుంటారని అంచనా వేస్తున్నారు.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే లోకల్ ఎన్నికలపై ఇప్పటికి ఇది మూడో మాట బాబుగారి నోట. అందువల్ల ఇదే ఖాయం అని అనుకోవడానికీ లేదు. మళ్లీ మరో మాట వచ్చినా ఆశ్చర్యమూ లేదు.

Show comments