ఫొటో స్టోరీ: 'డీడీఎల్‌జే'కి లెజెండ్‌ పోటీనా.?

నిజం మాట్లాడుకోవాలంటే, ఈ రోజుల్లో 50 రోజుల సినిమా ఓ పెద్ద జోక్‌. మొన్నటికి మొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్‌' సినిమాకి ఏమయ్యింది.? 50 రోజుల పండగ.. అనే పోస్టర్‌ రాకముందే, ఆ సినిమా టెలివిజన్‌ ఛానల్‌లో 'షో' అయిపోయింది. అది కాస్తా వివాదంగా మారిందనుకోండి.. అది వేరే విషయం. 

సినిమా ఎంత పెద్ద హిట్‌ అయినా అవ్వొచ్చుగాక, 50 రోజుల పండుగ చేసుకునేంత సీన్‌ టాలీవుడ్‌లో కన్పించడంలేదు. ఒకప్పుడు అలా కాదు. 100 రోజులు, 200 రోజులు, 300, 365 రోజులు.. ఇలా పండగల మీద పండగలు చేసేవారు. ఇప్పుడంత ఓపిక సినీ జనాలకీ లేదు, ప్రేక్షుకులకీ లేదు. అసలు, వీకెండ్‌ దాటిన తర్వాత, సోమవారానికి పరిస్థితి గందరగోళంగా తయారవుతోంది చాలా సినిమాలకి. 

ఈ పరిస్థితుల్లో ఓ సినిమా వెయ్యి రోజులు ప్రదర్శితమవడమంటే చిన్న విషయమా.? కానే కాదు. బాలీవుడ్‌లో 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయెంగే' సినిమా రికార్డు స్థాయిలో చాలా ఎక్కువకాలం ప్రదర్శితమయ్యింది. ముంబైలోని మరాఠా మందిర్‌ ఇందుకు వేదికయ్యింది. ఆ సినిమాలో వున్న ఫీల్‌ అలాంటిది. ఈ మధ్యనే ఆ సినిమా యూనిట్‌ అంతా పెద్ద పండగ చేసి మరీ, ఆ సినిమాని థియేటర్‌లోంచి లేపేశారనుకోండి.. అది ఏరే విషయం. 

మరి, బాలయ్య సినిమా 'లెజెండ్‌' వెయ్యి రోజులు దాటేస్తోందనే ప్రకటనని ఎలా అర్థం చేసుకోవాలి.? బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్‌' మంచి విజయాన్నే అందుకుంది.. కాదనలేం. కానీ, ఈ స్థాయిలో వెయ్యి రోజులు.. అంటూ ప్రకటించడం సినిమాని నవ్వులపాల్జేయడమే.!

Show comments