పవన్‌ దగ్గర డబ్బులుంటాయా మరి.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి తన వద్ద ఆర్థిక స్తోమత సరిపోదంటూ అప్పట్లో 'కుళ్ళు జోకు' ఒకటి పేల్చారు జనసేన అధిపతి, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌. 2019 ఎన్నికల నాటికి మాత్రం జనసేన పార్టీ పూర్తిగా రెడీ అవుతుందనీ, ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారాయన. 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అన్ని చోట్లా కాదు లెండి.. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు సంబంధించి ఈ ఎన్నికలు జరుగుతాయి. 

ప్రధానంగా విశాఖపట్నం కార్పొరేషన్‌ ఎన్నికలు ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా వున్నాయి. అదొక్కటే కాదు, రాయలసీమలోనూ పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఎన్నికల సందడి కనిపించనుందది. 

అయితే, రైల్వే జోన్‌ సెంటిమెంట్‌ విశాఖలో ఎక్కువగా కన్పిస్తోంది. రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం ఎటూ తేల్చడంలేదు. మామూలుగా అయితే ఈ తరహా ఎన్నికల్లో అధికార పార్టీకే ఎడ్జ్‌ ఎక్కువ. విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ఉనికిని చాటుకోవడం కష్టం. అధికార పార్టీ రాజకీయాలు అలా తగలడ్తాయి. కానీ, ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా.. ప్రభుత్వాల పతనం ఈ ఎన్నికల నుంచే మొదలవుతుందనుకోండి.. అది వేరే విషయం. అందుకే, ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. విపక్షాల్ని వీలైనంతవరకు నిర్వీర్యం చేసేస్తాయి. 

ఇక్కడే, ఇప్పుడు అందరి దృష్టీ పవన్‌కళ్యాణ్‌ పార్టీ జనసేన మీద పడింది. బీజేపీ - టీడీపీ కలిసి పోటీ చేయనుండడం ఖాయం. ఈ రెండిటినీ దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా పవన్‌కళ్యాణ్‌ రంగంలోకి దిగాలి. అప్పుడే ప్రతిపక్షానికీ కాస్తంత బలం చేకూరుతుంది. కానీ, పవన్‌కళ్యాణ్‌కి ఇంకా బీజేపీ - టీడీపీ మీద ప్రేమ తగ్గలేదు. నిద్దట్లో కలవరింతల్లా రెండు ప్రెస్‌మీట్లు పెట్టి ఊరుకున్నారాయన. ఎటూ కార్యకర్తలూ అత్యుత్సాహం చూపుతున్నారు గనుక (కార్యకర్తలంటే అభిమానులే..), కాస్త డబ్బులు చూసుకుని, జనసేన పార్టీని ఇలాగైనా ఎన్నికల్లోకి పవన్‌కళ్యాణ్‌ దింపుతారేమో వేచి చూడాలి.

Show comments