ఆ హక్కు బీజేపీకి మాత్రమే ఉందా జైట్లీ జీ!

ఆఖర్లో అడిగాడు.. సీతారాం ఏచూరి, “సూటిగా సుత్తి లేకుండా చెప్పండి, ఏపీకి ప్రత్యేక ఇస్తున్నారా లేదా?’’ అని అప్పుడు జైట్లీ లేచి కూడా సమాధానం చెప్పలేదు. కూర్చునే “విభజన చట్టం ప్రకారం..’’ అని ఏదో చెప్పాడు. ఆ విషయాన్ని సభాపతి స్థానంలో కూర్చుకున్న కురియన్ రిపీట్ చేశారు. “చేయదగినవన్నీ చేస్తామని ఆయన అంటున్నారు..’’ అని కురియన్ వివరించి చెప్పారు!

ఏపీకి అది చేశాం.. ఇది చేశాం.. అని చెబుతూనే, ప్రత్యేక హోదా అంశం గురించి మాత్రం మాట్లాడవద్దు అన్నట్టుగా సాగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధాన ప్రసంగం. ప్రత్యేక హోదా అంశం పై  మాత్రం ఆయన సూటిగా, స్పష్టంగా చెప్పలేదు. “రాజకీయం చేయొద్దు..’ అని మాత్రం ఆయన ఇతర రాజకీయ పక్షాలకు హితబోధ చేశాడు.

పోలవరానికి నిధులిచ్చాం, రాజధాని నిర్మాణానికి రెండువేల కోట్లు ఇచ్చాం.. ఇంకా అనేక రకాలుగా నిధులిచ్చాం అంటూ దండకం చదివిన జైట్లీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం “ఆ ఒక్కటీ అడక్కు..’’ అని తేల్చి చెప్పాడు. దానిపై ఇతర రాజకీయ పక్షాలది, కాంగ్రెస్ ది కేవలం రాజకీయం అని మాత్రం ఈయన తేల్చి చెప్పాడు. అలా చేయవద్దని సూచించాడు.

మరి ఇందు మూలంగా అర్థం చేసుకోవాల్సినది ఏమిటి? ప్రత్యేక హోదా అంశం గురించి ఎవరూ రాజకీయ చేయకూడదు. బీజేపీ తప్ప! ఆవిషయంలో కాంగ్రెస్ మాట్లాడినా, వైఎస్సార్ కాంగ్రెస్ మాట్లాడినా అది కేవలం రాజకీయం. తెలుగుదేశం, బీజేపీలు జాయింట్ ఇచ్చిన హామీలను మాత్రం అలా అనకూడదు!

తామిద్దరం జాయింటుగా అధికారంలోకి వస్తే పదిహేనేళ్ల ప్రత్యేక హోదా అని ఈ రెండు పార్టీలూ తమ తమ మేనిఫెస్టోల్లో పేర్కొన్నాయి. ఇప్పుడు మాత్రం ఆ విషయంలో ఎవరు డిమాండ్ చేసినా.. వారందరిదీ రాజకీయం అని తేల్చేస్తున్నారు. బీజేపీ వాళ్లు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదేళ్లకూ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కేవలం రెండేళ్ల కిందట మోడీ ఆధ్వర్యంలో ఎదుర్కొన్న ఎన్నికలతోనే కమలం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండబోదు. రాజకీయం చేయడం తమ ఒక్కరి హక్కే అనుకొంటే.. అసలు రాజకీయం ఏమిటో రేపటి ఎన్నికల్లో ప్రజలు అర్థమయ్యేలా చేయగలరు.

Show comments