రఘురాం రాజన్ మీద నిప్పులు చెరుగుతూ.. తన వ్యాఖ్యానాలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతానని రాజన్ ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చిన సుబ్రమణ్య స్వామి తీరుపై ‘గ్రేట్ ఆంధ్ర’ లో ప్రచురించిన ఒక వార్త కు స్పందనలా సంభవిస్తున్నాయి పరిణామాలు.
రాజన్ అమెరికా పౌరసత్వం విషయంలో అభ్యంతరం చెబుతూ, దాని వల్లనే ఆయన ఆర్బీఐ గవర్నర్ హోదాలో ఉండటానికి వీల్లేదని వాదిస్తున్న స్వామి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియం విషయంలో ఎందుకు స్పందించడం లేదని గ్రేట్ ఆంధ్ర ప్రశ్నించింది. రాజన్ లాగే సుబ్రమణియం కూడా అమెరికా పౌరుడు.. అమెరికన్ ఎకనమిస్ట్ అనే విషయాన్ని ప్రస్తావించింది. ఆయనను ఏరి కోరి మోడీ తెచ్చుకున్నారు అనే విషయాన్ని పాఠకులకు వివరించింది.
సుబ్రమణ్య స్వామి.. మోడీ సలహాదారులపై మాట్లాడవేం?!
ఈ అంశాన్ని గ్రేట్ ఆంధ్ర ప్రస్తావించిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. తాజాగా అరవింద్ సుబ్రమణియంను లక్ష్యంగా చేసుకుని సుబ్రమణ్య స్వామి ట్వీట్లు వదిలాడు. అమెరికా ప్రయోజనాల కోసం భారత్ కు వ్యతిరేకించాలని యూఎస్ కాంగ్రెస్ కు సూచించిన వ్యక్తి అరవిందే అని స్వామి గుర్తు చేశాడు.
ఆయనను ప్రధానమంత్రి సలహాదారు పదవి నుంచి తక్షణం తొలగించాలని స్వామి డిమాండ్ చేశాడు. అమెరికన్ పౌరులవ్వడమే కీలక పదవుల్లో ఉన్న వారి విషయంలో అభ్యంతరం అయితే.. అందరి విషయంలోనూ ఒకేలా వ్యవహరించాలన్న గ్రేట్ ఆంధ్ర భావానికి తగ్గుట్టుగా ఉంది సుబ్రమణ్య స్వామి స్పందన. మరి ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.