అయినోళ్లే అడ్డంగా బుక్ చేశారంటున్న అమ్మ!

కన్నడ మంత్రి డికె శివకుమార్ ఆస్తుల మీద నాలుగురోజులుగా జరిగిన ఐటీ దాడులు ఒక కొలిక్కి వచ్చాయి. శివకుమార్, ఆయన మిత్రులు, బంధువులకు చెందిన 66 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు సుమారు రూ.15 కోట్ల విలువైన బంగారం, అంతకంటె విలువైన నగదు, ఇంకా భారీ మొత్తం ఆస్తుల ప్రతాలు అన్నీ స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బెంగుళూరు ఆశ్రయం కల్పించి, వారిని విలాసాల్లో ముంచుతూ క్యాంపు నిర్వహించే బాధ్యత చూస్తున్నందుకు ఆయనమీద భాజపా ప్రభుత్వం ఐటీ దాడులు చేయించినట్లుగా తొలుత అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే తాజా ట్విస్టు ఏంటంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. తన కొడుకు మీద ఐటీ దాడులు చేయించారని డికె శివకుమార్ తల్లి పేర్కొంటున్నారు. ఇది నిజంగానే ఈ వ్యవహారంలో అనూహ్యమైన ట్విస్టు.

డికె శివకుమార్ అంటే దేశంలోనే అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకుల్లో ఒకరుగా గుర్తింపు ఉంది. ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగానూ వాడుకుంటూ ఉంది. ఆయన వద్ద దొరికిన ఓ డైరీలో జాతీయ కాంగ్రెస్ కమిటీకి రూ.3 కోట్లు పంపినట్లు కూడా రాసి ఉంది. అయితే ఈ సొమ్ము తమ పార్టీకి విరాళంగా అందలేదని జాతీయ నాయకులు ఖండించారు.

కేవలం ఈ విరాళాల వ్యవహారమే కాకుండా, పార్టీకి ఆపత్సమయంలో అండగా నిలిచేనేతగా శివకుమార్ కు పేరుంది. అందుకే ఆయనకు కాంగ్రెస్ లో చాలా ప్రాధాన్యం ఉంది. గుజరాత్ లో రాజ్యసభ స్థానాన్ని  ఎట్టి పరిస్థితుల్లోనూ తన సలహాదారు అహ్మద్ పటేల్ కు కట్టబెట్టదలచుకున్న సోనియా, అక్కడి ఎమ్మెల్యలతో క్యాంపు నిర్వహించే బాధ్యత శివకుమార్ చేతిలో పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు.

దాన్ని ఆయన చక్కగానే నిర్వహించారు. వారికి విపరీతమైన విలాసాలు రుచిచూపించారు. తాను కూడా అదే రిసార్ట్స్ లో ఓ సూట్ తీసుకుని దగ్గరుండి వారి అవసరాలు గమనించుకున్నారు. ఐతే ఐటీ దాడులు షురూ అయిన తర్వాత.. కాంగ్రెస్ భాజపా మీద నిందలు వేయడానికి ఈ వ్యవహారం ఉపయోగపడింది. తాజాగా స్వయానా శివకుమార్ తల్లి గౌరమ్మ మాత్రం ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉందనే అనుమానిస్తున్నారు.

తన కొడుకును ఆయన దూరం పెట్టారని, త్వరలోనే ఎన్నికలు రాబోతున్న తరుణంలో తన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడేమోననే భయంతో సిద్ధరామయ్య ఇదంతా చేయిస్తున్నట్లుగా గౌరమ్మ ఓ టీవీ చానెల్ తో చెప్పారు. మొత్తానికి కన్నడ ఐటీ రాజకీయం పలు మలుపులు తిరుగుతున్నట్లుగా ఉంది.

Show comments