'అమ్మ'పై ఆ 'కరుణ' ఎందుకు లేదు.?

సినీ ప్రముఖులు ఆపరేషన్‌ థియేటర్‌లోంచి కూడా ఫొటోల్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం చూస్తున్నాం. అదో ట్రెండ్‌.! కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ తనకు కిడ్నీ సమస్య వుందనీ, త్వరలో కిడ్నీ మార్పిడి జరగనుందని ఆసుపత్రి నుంచే సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాని ఆయా సెలబ్రిటీలు ఆయా విధాలుగా వాడుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. 

సరే, సోషల్‌ మీడియా వరకూ వెళ్ళాలా.? వద్దా.? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టం. కానీ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి 75 రోజులపాటు ఆసుపత్రికే పరిమితమైతే, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు వుండదా.? న్యాయస్థానాల్ని ఆశ్రయించినాసరే, ఆ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఎలా వుందన్నదానిపై స్పష్టత రాలేదు. చివరికి, ఆసుపత్రి నుంచి వచ్చిన కబురు, 'ప్రియతమ ముఖ్యమంత్రి తుదిశ్వాస విడిచారు..' అని. 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన 75 రోజుల తర్వాత మృతి చెందిన విషయం విదితమే. ఈలోగా చాలా రచ్చ జరిగింది. ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. అయినా, ప్రభుత్వం జయలలిత ఆరోగ్యంపై పూర్తిస్థాయి స్పష్టతతో అధికారిక ప్రకటన చేయలేకపోయింది. అదే, డీఎంకే అధినేత కరుణానిధి ఆసుపత్రిలో చేరితే ఎప్పటికప్పుడు బులెటిన్లు బయటకు వస్తున్నాయి. ఆసుపత్రిలో ఇలా వున్నారంటూ కొన్ని ఫొటోలు కూడా వచ్చాయి. 'అమ్మ' జయలలిత విషయంలో ఎందుకిలా జరగలేదు.? దీని వెనుక కుట్ర ఏమైనా వుందా.? ఇప్పుడీ అనుమానాలు ఇంకోసారి కొత్తగా తెరపైకొస్తున్నాయి. 

జయలలితకు 'స్లో పాయిజన్‌' ఎక్కించారు.. ఆమెను హత్య చేశారు.. అని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, కరుణానిధి ఆసుపత్రిలో వున్న ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. 'ఏదో కుట్ర జరిగి వుండకపోతే, ఆసుపత్రిలో వున్న జయలలిత ఫొటోని ఎందుకు విడుదల చేయలేకపోయారు.?' అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతే కాదు, 'నేను క్షేమం..' అని జయలలిత పేరుతో ఓ ప్రకటనను అప్పట్లో విడదుల చేశారు. ఆ ప్రకటన సమయంలోనూ ఆమె ఫొటో బయటకు రాకపోవడం ఆశ్చర్యకరమే. అన్నిటికీ మించి, 75 రోజులపాటు ఆసుపత్రిలో వున్న జయలలిత ఎన్ని అధికారిక దస్త్రాలపై సంతకం చేశారన్నది ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. వీటన్నిటిగురించీ ఆలోచిస్తే, కుట్రకోణం సుస్పష్టం. కానీ, దేశ రాజకీయాల్లో చాలా మరణాలు ఇలాంటివే. ఆ డెత్‌ మిస్టరీస్‌ ఎప్పటికీ అలానే వుంటాయ్‌. Readmore!

Show comments

Related Stories :