అబ్జర్వేషన్‌: తలా తోకా వుందా.?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షానికీ, విపక్షాలకీ మధ్య 'మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌' చిచ్చుపెట్టింది. మిత్రపక్షమైన జనసేన కూడా, అధికార పక్షం తీరుని తప్పు పడ్తోంది ఈ మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ విషయంలో. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే. పెద్దయెత్తున ఈ మేరకు భూ సేకరణ కూడా జరిగింది. అయితే, అది బలవంతపు భూ సేకరణ అని బాధిత రైతులు వాపోతున్నారు. 

ఇంకోపక్క, మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌తో నదీ జలాలు కలుషితమవుతాయనీ, తమ జీవితాలు దుర్భరంగా మారతాయని, ఫుడ్‌ పార్క్‌ సమీప ప్రాంతాల ప్రజలు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. పేరుకి ఫుడ్‌ పార్క్‌ అయినా, అదీ ఓ రకమైన పరిశ్రమే. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది గనుక, పరిశ్రమలకు అడ్డు తగలవద్దంటూ ప్రభుత్వం చెబుతోంది. అసలంటూ మనుషుల జీవితాలే నాశనమైపోతోంటే, ఉద్యోగాలు - ఉపాధి ఏంటన్నది బాధితుల ఆవేదన. 

సరిగ్గా ఈ టైమ్‌లోనే, అధికార పార్టీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు అయిన నారా లోకేష్‌, మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'అక్కడేం జరుగుతుంది.. తల తోక తీసేస్తారంతే.. కెమికల్స్‌ వినియోగం ఏముంటుందక్కడ.?' అని అమాయకంగా ప్రశ్నించేశారాయన. కెమికల్స్‌ వాడనప్పుడు భూములు, నీరు ఎలా కలుషితం అవుతుందంటూ విపక్షాలపై మండిపడ్డారు నారా లోకేష్‌. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం కెమికల్స్‌ వాడతారన్న విషయం, హెరిటేజ్‌ సంస్థను నిర్వహిస్తోన్న నారా లోకేష్‌కి తెలియకపోతే ఎలా.? ఆక్వా ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్‌ చేసే క్రమంలో కెమికల్స్‌ వాడకం తప్పనిసరి. ఈ క్రమంలో వ్యర్ధాలు ఖచ్చితంగా నీటిలో కలుస్తాయి.. భూమిలోకి ఆ వ్యర్ధ జలాలు ఇంకిపోతాయి. అలా జరగకుండా వుండేందుకే పైప్‌లైన్‌ ద్వారా సముద్రంలోకి వ్యర్ధ జలాలు వెళ్ళేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అదీ బాధిత రైతులు, ప్రజలు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ని కలిసిన తర్వాత. 

అసలు కెమికల్స్‌ వినియోగం వుండదంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, అసలక్కడ కెమికల్స్‌ వినియోగం ఎలా వుంటుందో విడమర్చి చెప్పారు. బాధిత రైతులు, ప్రజల్ని ఆయన స్వయంగా పరామర్శించారు. ప్రజల తరఫున తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్బంగా జగన్‌ వ్యాఖ్యానించారు. 

ఏదిఏమైనా, విదేశాల్లో చదువుకుని వచ్చిన నారా లోకేష్‌కి, ప్రపంచంలోనే మేటి అడ్మినిస్ట్రేటర్‌ అని చెప్పుకునే చంద్రబాబుకీ, ఆక్వా ఫుడ్‌ పార్క్‌లో కెమికల్స్‌ వినియోగమే వుండదనేంత గొప్ప నాలెడ్జ్‌ ఎలా వచ్చిందో ఆ పైవాడికే ఎరుక.!

Show comments