అన్నన్నా.. వర్మ ఎంత మాట అనేశాడు.?

'వీడసలు మనిషే కాడు.. వీడు నయీమ్‌..' అంటూ గ్యాంగ్‌ స్టర్‌ నయీమ్‌ బయోపిక్‌ తీస్తున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ మేరకు ఇప్పటికే టైటిల్‌ లోగో ఒకటి విడుదలయ్యింది. తాజాగా 'నయీమ్‌' సినిమా థీమ్‌ సాంగ్‌ని కూడా విడుదల చేసిన వర్మకి, నయీమ్‌ అనుచరుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయట. 

ఏమో, నయీమ్‌ పేరుతో ఎవరు బెదిరిస్తున్నారో, అసలు ఆ బెదిరింపులు నిజమో కాదోగానీ, వర్మ సోషల్‌ మీడియా వేదికగా, నయీమ్‌ అనుచరులకు అల్టిమేటం జారీ చేశాడు. 'నేను నయీమ్‌లకే నయీమ్‌నన్న విషయాన్ని నయీమ్‌ అనుచరులు తెలుసుకోవాలి..' అంటూ వర్మ కౌంటర్‌ ఇచ్చాడు. కౌంటర్‌ బాగానే వుందిగానీ, 'వీడసలు మనిషే కాదు.. వీడు నయీమ్‌..' అని పేర్కొన్న వర్మ, 'నేను నయీమ్‌లకే నయీమ్‌ని..' అనడం ద్వారా ఏం చెప్పదలచుకున్నట్లు.? 

అన్నట్టు, వర్మ 'నయీమ్‌' సినిమా కోసం నయీమ్‌ అనుచరుల్ని జైల్లో కలిశాడట, నయీమ్‌ గురించి చాలా చాలా తెలుసుకున్నాడట. కరాచీలో వున్న వ్యక్తితోనూ నయీమ్‌ సంబంధాల్ని తెలుసుకున్నాడట వర్మ. కరాచీలో ఎవరున్నారబ్బా.? బహుశా మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అయి వుండొచ్చేమో.! నయీమ్‌ దురాగతాల గురించి నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం. అయినాసరే, వర్మ సినిమా అంటే, అందులో 'కల్పితం' చాలా ఎక్కువగానే వుంటుంది కదా. అదేంటో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Show comments