పవర్‌ స్టార్‌ కోసం 'పసుపు'..'ఎరుపు' వెయిటింగ్‌...!

'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' పేరుతో హీరో కమ్‌ జనసేన అధ్యక్షుడు కాకినాడలో సభ నిర్వహించిన తరువాత మళ్లీ నిశ్శబ్దం ఏర్పడింది. మళ్లీ ఎక్కడైనా సభ ఉంటుందో లేదో తెలియదు. పవన్‌ మళ్లీ ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయనేదో పుస్తకం రాస్తున్నాడట. అది బయటకొస్తేగాని ఆయన పార్టీ సిద్ధాంతాలేమిటో అర్థం కావు. ఆయన భావజాలం ఏమిటో ఆకళింపు కాదు. అది కొత్త ఏడాది మొదట్లో వస్తుందని అంటున్నారు. సరే...పవన్‌ తన సినిమాల్లో కుదురు లేకుండా అటూ ఇటూ ఊగుతూ ఉంటాడు. ఒక్కచోటా నిలకడగా ఉండడు. 

రాజకీయల్లోనూ అలాగే ఉన్నప్పటికీ ఆయన తమవైపు వస్తే బాగుండనని టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీల్లోనూ ప్రధానంగా సీపీఎం ఈవిధమైన ఆలోచన చేస్తోంది. పవన్‌ చూపు కూడా ఆ పార్టీ మీదనే ఉంది. సీపీఐ పవన్‌తో కలుస్తుందో లేదో చెప్పలేం. కలిస్తే గిలిస్తే సీపీఎం కలవొచ్చు. అలాంటి సంకేతాలు ఇప్పటినుంచే ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరే స్వయంగా అలాంటి సంకేతమిచ్చారు. పవన్‌తో కలిసి పని చేయాలనుకుంటే ఆ నిర్ణయం రాష్ట్ర పార్టీయే తీసుకుంటుందని ఈమధ్య చెప్పారు. పవన్‌ కాకినాడ సభలో సీపీఎంతో కలిసి పనిచేస్తానని సంకేతాలిచ్చారు. 

సరే...కమ్యూనిస్టుల పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత దయనీయం.  ఈ పార్టీలు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడమో, అలాంటి ప్రయత్నాలు చేయడమో చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో పొత్తులు కుదరక ఒంటిరిగానే పోటీ చేశాయి. ఫలితంగా పూర్తిగా నష్టపోయాయి. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కనబడుతున్నాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా దక్కించుకోవాలంటే ఆయన అండ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాయి. పవన్‌ తన సిద్ధాంతాలు, విధానాలు చెబితే వామపక్షాలు ఏదైనా స్టెప్‌ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఎదురు చూస్తున్నాయి. 

టీడీపీ కూడా పవన్‌ ఏం చెబుతాడా అని ఎదురుచూస్తోంది. ఆయన బీజేపీ వ్యతిరేకిస్తున్నాడని స్పష్టమైపోయింది. కాబట్టి కమ్యూనిస్టులకు ఆయనతో కలిసేందుకు అభ్యంతరం ఉండదు. చంద్రబాబు నాయుడుకు ఎప్పటి రాజకీయాలు అప్పుడే కాబట్టి ప్రస్తుతం 'ప్రత్యేక సాయం' అంగీకరించారు. కాని ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? అనేది అనుమానమే.  బీజేపీతో కలిస్తే మునిగిపోతామనే భయం ఉంది. అందుకే ఆయన పవన్‌ కలిసొస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. పవన్‌ కలిస్తే ఆయన ఇమేజ్‌ ఉపయోగపడుతుంది. ఆయన అభిమానులు ఓట్లే కాకుండా, కాపు సామాజికవర్గం ఓట్లు కూడా పడతాయనే ఆశ ఉంది. 

పవన్‌ను టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు బాబు అప్పుడే ప్రారంభించినట్లు సమాచారం. ఈ పనిని కొందరు మంత్రులకు అసైన్‌ చేసినట్లు తెలుస్తోంది. వారిని పవన్‌తో మాట్లాడాల్సిందిగా పురమాయించారు. 2019 ఎన్నికల్లో పవన్‌ సహకారం టీడీపీకీ తప్పనిసరిగా అవసరమవుతుందని బాబు గట్టిగా నమ్ముతున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం. చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. దానికి భారీగానే నిధులిచ్చారు. కాపు విద్యార్థుల చదువుల కోసం సహాయం చేస్తున్నారు. కొందరిని కార్పొరేషన్‌ ఆర్థిక సహాయంతో విదేశాలకు పంపుతున్నారు. కాపు భవన్‌లు నిర్మిస్తామన్నారు. పలు సంక్షేమ కార్యమ్రాలు అమలు చేస్తున్నారు. 

అయినప్పటికీ వీటి ద్వారా వస్తున్న ఫలితాలు బాబు సంతృప్తినివ్వడంలేదట...! ఎన్నికల్లో కాపుల ఓట్లు పడేందుకు ఈ కార్యక్రమాలు చాలవని అనుకుంటున్నారట. అందుకే పవన్‌ కళ్యాణ్‌ను 'పచ్చ' పార్టీ వైపు లాక్కోవాలని ఆయన పట్టుదలగా ఉన్నారట. రాష్ట్రంలోని సమస్యలను, వాటి పరిష్కారం కోసం సర్కారు చేస్తున్న కృషిని, ప్రజా సంక్షేమాన్ని పవన్‌ కళ్యాణ్‌కు వివరించి, ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలని, రాజకీయంగా క్లారిటీ తీసుకోవాలని తాను నియమించిన మంత్రుల బృందానికి బాబు దిశానిర్దేశం చేశారని సమాచారం. 

గత్యంతరం లేని పరిస్థితిలోనే కేంద్రం ఆఫర్‌ చేసిన 'ప్రత్యేక సాయం' తీసుకున్నామని పవన్‌కు నచ్చచెప్పాలని చంద్రబాబు మంత్రుల బృందానికి చెప్పారట. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ సీఎం చంద్రబాబు చెప్పిందాంతో కన్విన్స్‌ అయిపోయి 'మీతో కలుస్తా' అంటే బాబు బీజేపీని వదిలేయడం ఖాయం. బాబు, పవన్‌ బీజేపీని వదిలి ఒక్కటైతే కమ్యూనిస్టులు కూడా కలుస్తామంటారా? బీజేపీయే కదా వారికి ప్రధాన అడ్డంకి. ఏది ఏమైనా పవన్‌ ఏం చెబుతారన్నదానిపైనే రాజకీయ సమీకరణాలుంటాయి. 

Show comments