చంద్రబాబు సొంతింటి యవ్వారమా.?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు తన సొంత ఇంటి వ్యవహారంలా మార్చేస్తున్నారు. పోనీ, అలాగన్నా అక్కడ అవినీతికి తావు లేకుండా చేస్తున్నారా.? అంటే అదీ లేదు. సొమ్ము జనాలది.. సోకు చంద్రబాబుది.. ఇదీ అసలు వ్యవహారం. స్విస్‌ ఛాలెంజ్‌ అనీ, కన్సార్టియం అనీ ప్రజలకు అర్థం కాని పద ప్రయోగాలు చేస్తున్న చంద్రబాబు, అంతా 'చీకట్లోనే' చక్కబెట్టేస్తున్నారు. 'కొన్ని వ్యవహారాల్ని బహిర్గతం చేయలేం..' అని ప్రభుత్వం చెబుతోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. 

న్యాయస్థానం మొట్టికాయలు వేశాకగానీ, ఆ వివరాల్ని బహిర్గతం చేసేందుకు చంద్రబాబు సర్కార్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసేసుకుని, 'రహస్యం ఏమీ లేదు.. అంతా బహిర్గతమే..' అంటూ చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడు కొత్త కథలు చెబుతోంది. ఈ పనేదో ముందే చేస్తే, అసలు వివాదమే వుండేది కాదు కదా.! కానీ, అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు.? 

అప్పనంగా, అమరావతిని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేయాలనీ, తద్వారా లబ్ది పొందాలనీ చంద్రబాబు అండ్‌ టీమ్‌ భావించిందని ఎవరైనా ఆరోపిస్తే అందులో తప్పేముంటుంది.! ఓ ప్రాజెక్టు కట్టాలన్నా, ఓ పథకం అమలు చేయాలన్నా, ఇంకోటన్నా.. దానికి సంబంధించి ప్రతి పైసా చెల్లించాల్సింది సామాన్యుడే. ఆ సామాన్యుడికి సంబంధమే లేదని చంద్రబాబు అంటే అదెలా కుదురుతుంది.? రాజధాని విషయంలో ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 

అమరావతి కోసం రైతుల నుంచి భూముల్ని లాక్కున్నారు. అభివృద్ధి చేసిన భూములంటూ ఆ రైతులకు బిచ్చమేస్తోంది చంద్రబాబు సర్కార్‌. అలా దోచుకున్న భూముల్ని విదేశీ కంపెనీలకు కట్టబెడ్తోంది. ఇందులో సింగపూర్‌ కన్సార్టియంకి పెద్దమొత్తంలో వాటాలు దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ బొచ్చెలో పడేది మళ్ళీ చిల్లర పైసాలే. అంతే, ప్రజలకు రాజధాని కారణంగా ఒరిగేదేమీ వుండదన్నమాట. ఇదే విషయాన్ని విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే, 'వాళ్ళంతా రాజధాని వ్యతిరేకులు..' అని చంద్రబాబు ముద్ర వేసేశారు. 

కోర్టు మొట్టికాయలతో, రహస్యాల్ని బహిర్గతం చేసేస్తానంటున్న చంద్రబాబు, ఇప్పుడేమంటారు.? ఇక్కడ విపక్షాల విజయం సుస్పష్టం. అధికార పార్టీ కుట్రలు దారుణంగా ఫెయిలయ్యాయన్నదీ అంతే వాస్తవం. ఇలాంటప్పుడే, న్యాయస్థానాల మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది. పాలకుల తాట తీయడంలో అప్పుడప్పుడూ న్యాయస్థానాలు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టే, ఇంకా వ్యవస్థ మీద ప్రజల్లో కాస్తో కూస్తో నమ్మకం మిగిలే వుంది.

Show comments