బాలయ్య సినిమా.. రంగంలోకి హెలికాప్టర్లు

బాలకృష్ణ సినిమాల్లో కారు ఛేజ్ లు కామన్ అయిపోయాయి. చిన్నప్పట్నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక రైలు ఎపిసోడ్స్ కూడా చూసేశాం. తొడకొట్టి ట్రెయిన్ ఆపేస్తాడు బాలయ్య ఓ సినిమాలో. ఇంకాస్త వెనక్కి వెళ్తే బైక్స్, సైకిళ్లు, ఎడ్ల బండ్లు కూడా అయిపోయాయి. మరి కొత్తగా ఏం చూపించాలి. అందుకే ఈసారి బాలయ్య సినిమా కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

నిజానికి బాలకృష్ణ సినిమాల్లో హెలికాప్టర్లు కూడా కొత్తకాదు. ఎన్నో ఇంట్రడక్షన్ సీన్లలో ఈ హీరో హెలికాప్టర్ నుంచి దిగాడు. కానీ ఈసారి మాత్రం ఛేజింగ్ కోసం హెలికాప్టర్లు వాడుతున్నారు. అవును.. బాలకృష్ణ-పూరిజగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హెలికాప్టర్ల ఛేజింగ్ ఉంటుందట. అంటే ఈసారి ఛేజింగ్ అంతా గాల్లోనే అన్నమాట.

బాలయ్య సినిమాకు సంబంధించి ఫ్రెంచ్ స్టంట్ మాస్టర్లను తీసుకున్నట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఈ హెలికాప్టర్ ఛేజ్ సన్నివేశాల కోసమే వాళ్లను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం "బాలయ్య అండ్ కో" పోర్చుగల్ లోనే ఉన్నారు. శ్రియ-బాలయ్య మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 40 రోజుల షెడ్యూల్ లో భాగంగా హెలికాప్టర్ ఛేజ్ కూడా తీస్తారట.

బాలయ్య-శ్రియ సన్నివేశాలకు సంబంధించి ఇప్పటికే ఓ క్లిప్ బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది కూడా. ఇకపై ఇలాంటి లీకులు ఉండకుండా యూనిట్ జాగ్రత్త పడుతోంది. బాలకృష్ణ 101వ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు.

Show comments