ఐటమ్ సాంగ్ విషయంలో అనసూయ రిక్వెస్ట్!

‘ఐటమ్ సాంగ్స్’ గా వ్యవహరించే పాటలను అలా అనకూడదని.. వాటిని ‘స్పెషల్ సాంగ్స్’ అని అనాలని అంటోంది అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియా లైవ్ లో ఈమె ఈ విధమైన వ్యాఖ్యానం ఒకటి చేసి వెళ్లింది. ‘ ఐటమ్ సాంగ్’ అనే మాట అభ్యంతకరమైన పదమన్నట్టుగా స్పందించింది అనసూయ. అసలు  దాన్ని అలా అనొద్దని.. దాన్ని స్పెషల్ సాంగ్ అనాలని ఈమె చెబుతోంది.

మరి ఇంతకీ ఈ అభ్యంతరాలు దేనికి అంటే.. సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్.. అదేనండీ, స్పెషల్ సాంగ్ చేస్తోందట. అందుకే.. ఐటమ్ సాంగ్ ను ఐటమ్ సాంగ్ అనకూడదని, దాన్ని స్పెషల్ సాంగ్ అనాలని కోరుతోంది.

అమ్మాయిని ‘ఐటమ్’ గా అభివర్ణిస్తూ ఎవరో ‘ఐటమ్ సాంగ్’ అనే పదాన్ని తయారు చేశారని, అందరూ దాన్నే వ్యవహారికంలోకి తీసుకున్నారని.. అయితే అమ్మాయిలు ‘ఐటమ్’ లు కాదని, కాబట్టి  అమ్మాయిలు చేసే ఆ గీతాన్ని ఐటమ్ సాంగ్ అనడానికి వీలులేదని అనసూయ స్పష్టం చేస్తోంది. 

అయితే.. అనసూయ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ‘ఐటమ్ సాంగ్’ అనేది చాలా వ్యవహారికంగా మారిపోయింది. దాని నిర్వచనం ఏమిటో, దాన్ని ఎందుకు ఐటమ్ సాంగ్ అంటారో తెలీయకపోయినా.. సామాన్య సినీ ప్రేక్షకులంతా ప్రత్యేక గీతాన్ని ‘ఐటమ్ సాంగ్’ అనే అంటారు.

 అందులో ‘ఐటమ్’ అంటే ఏమిటో చాలా మందికి తెలీదు, ఆ విషయంలో పట్టింపులు ఏమీ లేవు. సినిమాలో హీరోయిన్ గా కాని అమ్మాయి ఎవరైనా వచ్చి నర్తించిందంటే దాన్ని ‘ఐటమ్ సాంగ్’ అని అంటారు జనాలు. ఆ భావన పోవాలని అనసూయ క్లాస్ పీకింది. మరి అనసూయ నర్తించే ‘ఐటమ్ సాంగ్స్’ ను.. ‘స్పెషల్ సాంగ్స్’ గా వ్యవహరించేదెవరబ్బా!

Show comments