శశికళ.. పన్నీరు.. ఇద్దరికీ హెచ్చరికలా!

ముందుగా చెప్పేదేమిటంటే.. తమిళనాడులో పట్టుబడిన నల్ల దొంగలు శేఖర్ రెడ్డి అండ్ కో ని కానీ, తాజాగా ఈ జాబితాలో చేరిన ఆ రాష్ట్ర సీఎస్ ను కానీ సమర్థించడం లేదు. వారిపై సానుభూతులేమీ ఎవరికీ లేవు, కానీ.. ఇలాంటి దాడులన్నీ ప్రధానంగా తమిళనాడులోనే ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుక రాజకీయం ఏమిటి? అనేది మాత్రం విశేషంగాచెప్పుకోవాల్సిన అంశమే!

జయ మరణానంతర పరిణామాల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి తప్ప.. అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతోనో, లేక  అవినీతి పరుల భరతం పట్టాలనే పంతంతోనో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అనుకోవడం కేవలం అమాయకత్వం.

శేఖర్ రెడ్డి.. జయలలిత దగ్గరకు డైరెక్ట్ యాక్సెస్ ఉండిన వ్యక్తి. ఇక సీఎస్ జయలలిత మెచ్చిన వ్యక్తి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ చాలా సంవత్సరాలుగా జయలలితకు ప్రైవేట్ వ్యవహారాల సలహాదారుడిగా ఉన్నాడని, ఆ దయతోనే జయ ఈయనను సీఎస్ గా నియమించిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఒక రాష్ట్ర సీఎస్ మీద ఐటీ రైడ్స్ జరగడం దేశ చరిత్రలోనే ఇది తొలి సారి!

మామూలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరిగిన దాఖలాలు కనిపించవు, అలాంటిది ఏకంగా సీఎస్ ఇంటి మీదకే ఐటీ అధికారులు పడ్డారంటే.. దీని  వెనుక చాలా లెక్కలే ఉన్నాయని స్పష్టం అవుతోంది.

తమిళనాడు రాజకీయాలపై గ్రిప్ సాధించుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాలను చేయిస్తోందనే మాట వినిపిస్తోంది. శేఖర్ రెడ్డి , సీఎస్ లాంటి దొంగలు దొరకడం మంచిదే కానీ.. ఇదంతా మరో రాజకీయ వ్యూహంలో భాగమే.. అని స్పష్టం అవుతోంది. అటు పన్నీరు సెల్వం, ఇటు శశికళ.. ఇద్దరూ తోక జాడించకుండా ఉండేందుకు, తాము అనుకుంటే ఏమైనా చేయగలమని తమిళ నేతలకు సంకేతాలు ఇవ్వడానికే కేంద్రం ఈ పనులు చేపట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ పనుల ఆంతర్యం.. తమిళనాట బీజేపీ ని బలోపేతం చేయడమే అనే లక్ష్యం.. ఏ మేరకు నెరవేరుతుందో! 

Show comments