ఈ ఎన్నికలను లోకేష్ ‘సమీక్షించలేదా’?!

వందల మంది కాబట్టి... కొనేశారు, గెలిచేశారు.. అదే వేల మందికి వచ్చే సరికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోందిప్పుడు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని సంబరాలు చేసుకున్నంత సేపటిలోనే.. మిగతా ఆరు ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఈ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టుకున్న ప్రతి చోటా ఓటమి బాటన పయనిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

పశ్చిమ రాయలసీమ టీచర్స్ కోటాలో బచ్చల పుల్లయ్యను, తూర్పు రాయలసీమ టీచర్స్ కోటాలో నాయుడిని.. నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. వీరికి బీఫారమ్ ఇచ్చి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగానే ప్రచారం చేసింది. ఈ ఎన్నికల మీద కూడా లోకేష్, చంద్రబాబులు సమీక్షలు నిర్వహించారు. అయితే.. స్థానిక సంస్థల సమీక్షల్లో‘సక్సెస్’ అయిన పెదబాబు, చినబాబులు.. టీచర్స్ దగ్గర మాత్రం తమ పప్పులు ఉడికించుకోలేకపోయారు.

పశ్చిమ రాయలసీమలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి, తూర్పులో పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధించారు. ఆ రెండు స్థానాల్లో తెలుగుదేశానికి అలా ఝలక్ తగులగా.. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. అక్కడ వ్యూహాత్మకంగా కేజే రెడ్డిని బరిలోకి దించింది టీడీపీ. ఈ ఎన్నికల్లో కడప, కర్నూలు, అనంతపురం గ్రాడ్యుయేట్లు తెలుగుదేశానికి ఝలక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి మెజారిటీ పది వేలకు దాటింది!

ఇక తూర్పు రాయలసీమ విషయానికి వస్తే.. ఇక్కడా తెలుగుదేశానికి ఎదురుదెబ్బ తప్పడం లేదు. ఇక్కడా వ్యూహాత్మకంగా రెడ్డిని బరిలోకి దించినా టీడీపీకి కలిసి రావడం లేదు. పీడీఎఫ్ అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి మెజారిటీతో కొనసాగుతున్నారు. దాదాపు విజయం ఖరారు అయినట్టేనని సమాచారం.

ఉత్తరాంధ్రలో మాత్రం తెలుగుదేశానికి కొంచెం ఊరట దక్కేలా ఉంది. మిగతా స్థానాల్లో ప్రతిపక్షాల మెజారిటీ తో పోలిస్తే.. ఉత్తరాంధ్ర మెజారిటీ స్వల్పమే. ఇక్కడ పోటీ చేసింది తెలుగుదేశం అభ్యర్థి కాదు. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటు ఇచ్చింది టీడీపీ. 

తాము అధికారికంగా పోటీ చేసిన ప్రతి చోటా తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓటమి పాలవుతోంది. విజయం సాధించిన పీడీఎఫ్, ఎస్టీయూ అభ్యర్థులు.. ఎన్నికల ముందు జగన్ ను కలిసి మద్దతును కోరిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. వందల మందిని కాబట్టి కొన్నారు.. గెలిచారు, వేల మందికి వచ్చే సరికి పరిస్థితి ఇలా తయారైంది.. మరి రేపు లక్షల కోట్ల మంది మధ్య పోటీకి వెళ్తే ఎలా ఉంటుందో కథ!

Show comments