చట్ట సభల నిర్వహణకు సంబంధించి కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్ దారుణ వైఫల్యాన్ని చవిచూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చట్ట సభల నిర్వహణ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత హాస్యాస్పదంగా తయారైంది. చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు వచ్చేందుకు ఆస్కారం లేని పరిస్థితుల్ని కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పిస్తున్నారు.
కానీ, తెలంగాణ అసెంబ్లీ ఇందుకు భిన్నంగా నడుస్తోంది. చట్ట సభల్లో పొలిటికల్ గలాటా మామూలే. కానీ, అసలంటూ సభ జరగాలి కదా. ఆ కోణంలో చూస్తే, సభని నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళూ విజయవంతమవుతోంది. మొదట్లో విపక్షాల గొంతు నొక్కేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వమూ విమర్శలు ఎదుర్కొన్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని అత్యంత సమర్థవంతంగా తెలంగాణ సర్కార్ నిర్వహించింది. అదీ, రికార్డు స్థాయిలో.. ఎక్కువ రోజులపాటు సభ నడపడం అంటే చిన్న విషయం కాదు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విపక్షాలు, పరమ రొటీన్‌గా ఒకటీ అరా విమర్శలు అధికారపక్షంపై చేసినా, చివరికి సమావేశాలు సజావుగా సాగడం పట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. చట్ట సభలున్నది ప్రజా సమస్యల్ని చర్చించడానికే. అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య చర్చ సరిగ్గా జరిగితేనే, ప్రజలెదుర్కొంటున్న సమస్యలు ఎలివేట్ అవడం, వాటికి పరిష్కారం లభించడం జరుగుతుంది. కానీ, చట్టసభలంటే సామాన్యుడికి ఏహ్యభావం పుట్టేలా పార్లమెంటు సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం అత్యంత శోచనీయం.
మొత్తమ్మీద, కొత్త రాష్ట్రం తెలంగాణ, చట్ట సభల నిర్వహణ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందనడం అతిశయోక్తి కాదేమో. పార్టీ ఫిరాయింపుల కారణంగా విపక్షాలకు గొంతెత్తే అవకాశం లేకపోవడం వల్లే ఇంత సజావుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయనే వాదన వున్నా, ఆ ఫిరాయింపులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నాయి కదా.! అక్కడెందుకు అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడంలేదు.?
ఏదిఏమైనా చట్ట సభల నిర్వహణకు సంబంధించి మోడీ, చంద్రబాబు వైఫల్యం చెందితే.. కేసీఆర్ మాత్రం ఫుల్ మార్క్స్ వేయించేసుకుంటున్నారు. దాంతో, ఇతరత్రా విమర్శలు వివాదాలు ఏమున్నా, అవన్నీ చాలా లైట్‌గా కన్పిస్తున్నాయి తెలంగాణ ప్రజానీకానికి.