అంత మీడియా బలమున్నా అసంతృప్తేనా!

తెలుగుదేశం పార్టీకి ఉన్నంతగా మీడియా అండ ఉన్న పార్టీ దేశంలో మరేదీ లేదు! ఇప్పుడిప్పుడు ఆ స్థానాన్ని టీఆర్ఎస్ ఆక్రమించింది కానీ.. తెలుగుదేశం పార్టీకి తెలుగు మీడియాలో ఉన్న అండ అలాంటిలాంది కాదు! తెరాస అధికారంలో ఉంది కాబట్టి.. తెలుగు పేపర్లు, టీవీ చానళ్లు కేసీఆర్ భజన చేస్తున్నాయి. కానీ తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోయినా.. చంద్రబాబును దైవాంశ సంభూతుడిగా, లోకేష్ ను వరపుత్రుడిగా చూపే మీడియా కలాలు, గొట్టాలు ఉన్నాయి. ఇది కొత్తగా చెప్పాల్సింది కాదు, గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి తెలుగు జాతి గమనించిన విషయాలన్నీ ఇవన్నీ. వాటిని కొత్తగా ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు!

మరి ఇంత ఉన్నా.. తెలుగుదేశం పార్టీ అధినేతకు ఏ మాత్రం సంతృప్తి కనిపించడం లేదు. మహిళా పార్లమెంటు నిర్వహణపై మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాపై దాడికి దిగారు! ప్రత్యేకించి ఈ సారి బాబు జాతీయ మీడియాను లక్ష్యంగా చేసుకున్నాడు! మామూలుగా అయితే బాబు అసంతృప్తి అంతా ‘సాక్షి’ మీదే ఉంటుంది! జగన్ కుటుంబానికి చెందిన ఆ మీడియా వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని బాబు విమర్శలు చేస్తాడు. ఆఖరికి ఆ పత్రిక జర్నలిస్టులను వ్యక్తిగతంగా దూషించేంత అసహనాన్ని వ్యక్తం చేస్తారు  చంద్రన్న. 

ఇలా వ్యక్తిగతంగా తిట్టడం బాబుకు ఈ మధ్య అలవాటుగా మారింది. ఈ మధ్యనే టెన్ టీవీ జర్నలిస్టుపై కూడా బాబు అక్కసు వెల్లగక్కారు. తాజాగా జాతీయ  మీడియాపై బాబు విరుచుకుపడ్డాడు. కోడెల మాటలను జాతీయ మీడియా హైలెట్ చేయడాన్ని బాబుగారు తప్పుపట్టేశారు! ఆవలింతల ఫొటోలు వేశారని.. ఖాళీ సీట్లను చూపించారని గయ్యిమన్నాడు. ఈసారి బాబు ‘డెక్కన్ క్రానికల్’ పేరును కూడా ప్రస్తావించాడు!

అనుకూలంగా ఎంత మీడియా ఉన్నా.. ఆ మీడియా వర్గాలు చంద్రబాబు తరపున ఒక రేంజ్ లో చిడతలు అందుకున్నా.. బాబు మాత్రం అలాంటి భజనకు కొంచెం దూరంగా ఉంటే మీడియా వర్గాల మీద చిందులేస్తున్నాడు! మహిళా పార్లమెంట్ విషయంలో మీడియా తీరు సరికాదని చంద్రబాబు లెక్చరిచ్చేశాడు. ఏదేమైనా మీడియా మీద బాబుగారి అక్కసు పరిధులు దాటుతోంది సుమా! Readmore!

Show comments

Related Stories :