బస్తీ మే సవాల్‌: అర్థరాత్రి రాజకీయం

దేశానికి అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది.. చిత్రంగా ముఖ్యమైన పొలిటికల్‌ నిర్ణయాలన్నీ అర్థరాత్రి వేళలోనే జరుగుతుంటాయి. తమిళనాడులోనూ అర్థరాత్రి రాజకీయానికి రంగం సిద్ధమయినట్టుంది. కాస్సేపట్లో ముఖ్యమంత్రి (ఆపద్ధర్మ) పన్నీర్‌ సెల్వం, గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ కానున్నారు. కొన్ని రోజులుగా చెన్నయ్‌కి మొహం చాటేసిన గవర్నర్‌, ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నయ్‌లో ల్యాండ్‌ అయ్యారండోయ్‌.! 

ఆపద్ధర్మ.. అయినాసరే, ముఖ్యమంత్రి కదా.. అందుకే గవర్నర్‌ విద్యాసాగర్‌రావుని దర్శించుకునే అవకాశం ముందుగా పన్నీర్‌ సెల్వంకే దక్కింది. గవర్నర్‌ని చెన్నయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్‌ చేసుకున్నారు పన్నీర్‌ సెల్వం. 5 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారయ్యింది పన్నీర్‌ సెల్వంకి. ఇక, ఏడున్నర గంటల సమయంలో శశికళ, గవర్నర్‌ని కలుస్తారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, గవర్నర్‌ యెదుట బలప్రదర్శనకు దిగాలనుకున్న శశికళకు గవర్నర్‌ కార్యాలయం నుంచి చుక్కెదురవడం. కేవలం పది మంది బృందంగా రావాలని శశికళకు రాజ్‌భవన్‌ వర్గాలు సమాచారమిచ్చాయి. 

ఇంతకీ, ఇప్పుడేం జరుగుతుంది.? ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాని వెనక్కి తీసుకుంటానని పన్నీర్‌ సెల్వం చెప్పినట్టే, గవర్నర్‌ అవకాశమిస్తారన్నది ఓ వాదన. ఇంకో వాదన ఏంటంటే, శశికళ ఎటూ అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు గనుక, ఆమె కోరుతున్నట్లుగా పదవీ ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ 'సై' అనొచ్చు. ఇవేవీ కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేనందున, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలని ఇరువురికీ సూచించడం మరో ఛాయిస్‌. 

తప్పో, ఒప్పో.. నిబంధనల ప్రకారం అయితే గవర్నర్‌, శశికళతో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించాల్సి వుంటుంది. ఆ పని చేసే ఉద్దేశ్యమే వుంటే.. ఈ పాటికే ఆమె ముఖ్యమంత్రి అయిపోయారు. కాబట్టి, పన్నీర్‌సెల్వంని కొనసాగించడం వైపే గవర్నర్‌ మొగ్గు చూపవచ్చు. ఏ నిర్ణయం అయినాసరే, అర్థరాత్రి వెలువడే అవకాశాలున్నాయన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన. సో, గెట్‌ రెడీ ఫర్‌ మిడ్‌ నైట్‌ పొలిటికల్‌ ఖబర్‌.

Show comments