తెలుగుదేశం పార్టీ కి కమ్మ కులానికి ఉన్న అనుబంధం ఏమిటో వేరే వివరించనక్కర్లేదు. ఆవిర్భావం దగ్గర నుంచి టీడీపీ ని శ్వాసగా తీసుకొంటున్నారు కమ్మ కులస్తులు. ఒక్కో రాజకీయ పార్టీని ఒక్కో కులం వారు అభిమానించడం, ఓన్ చేసుకోవడం.. భారతీయ రాజకీయాల్లో కామనే. ఈ సహజమైన రాజకీయ చిత్రంలో తెలుగుదేశం-కమ్మ సామాజికవర్గానికి మధ్య ఎడతెగలేని బంధం ఉంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది.. అని కమ్మ వాళ్లు ఫీలవుతారు. అలాగే ఆ పార్టీ తరపున రాజకీయంగా కూడా కమ్మ వాళ్లకు అధిక ప్రాధాన్యత దక్కడంతో పాటు.. వ్యాపారావకాశాల విషయంలో కూడా ప్రభుత్వం నుంచి చాలా ప్రోత్సాహం ఉంటుందనేవీ సహజంగా వినిపించే అభిప్రాయాలు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఎదురుగాలి వీచిన సందర్భాల్లో కూడా కమ్మ వాళ్ల మద్దతు ఆ పార్టీకే ఉన్నట్టుగానే.. కమ్మ వాళ్ల జనాభా ఎంత తక్కువ ఉన్న చోట అయినా.. తెలుగుదేశంలో మాత్రం అంతా వాళ్ల హవానే కనిపించడం రొటీన్ గా జరిగేదే.
దీనికి ఉదాహరణ అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో కమ్మ సామాజికవర్గం జనాభా చాలా తక్కువ. ప్రత్యేకించి ఇతర సామాజికవర్గాలతో పోల్చి చూసినప్పుడు ఈ జిల్లాలో కమ్మ వాళ్ల జనాభా ఐదారు శాతం కూడా ఉండదు. ఏ ప్రాంతంలో కూడా కమ్మవాళ్ల సాంద్రత ఎక్కువగా ఉందని చెప్పడానికేం లేదు. బీసీలు అధికంగా ఉంటే ఈ జిల్లాలో కులాల వారీగా చూసుకుంటే.. రెడ్లు, బోయలు, కురవ, మాదిగ సామాజికవర్గాల జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే విచిత్రం ఏమిటంటే.. ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో కమ్మ వాళ్ల శాతం చాలా ఎక్కువ!
అనంతపురం, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కల్యాణదుర్గం నియోజకవర్గాలకు తెలుగుదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది కమ్మ సామాజకివర్గానికి చెందిన ఎమ్మెల్యేలే. వీరితో పాటు అదనంగా పయ్యావుల కేశవ్ రూపంలో మరో ఎమ్మెల్సీ ఉన్నాడు. ఈయన ఉరవకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఓవరాల్ గా పద్నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ఐదు మంది కమ్మ వాళ్లే. ఈ కులం జనాభా శాతానితో పోలిస్తే.. ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువ!
ప్రధానంగా బీసీల ఓట్ల పై ఆధారపడి జిల్లాలో పట్టు నిలుపుకొంటున్న టీడీపీ.. ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అనుకూల సామాజికవర్గానికే ప్రాధాన్యతను ఇస్తోందనే పేరు తెచ్చుకుంటోంది. ఇంతే కాదు.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో కూడా అణువణువునా కమ్మదనం ఉట్టి పడుతూ ఉండటం విశేషం.
అనంతపురంలో టీడీపీ జిల్లా స్థాయి మీటింగులకు వేదిక అవుతోంది ఆ టౌన్ లోని కమ్మభవన్. టౌన్ ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలత ఉన్న ఫంక్షన్ హాళ్లు చాలానే ఉన్నా.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కేరాఫ్ కమ్మ భవన్ అన్నట్టుగా సాగుతున్నాయి.
తాజాగా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా కార్యవర్గ సమావేశానికి కూడా కమ్మ భవనమే వేదిక అవుతోంది. పార్టీ మీటింగ్ అంటే.. ఇలా కులం పేరు ఉట్టిపడే భవన్ వద్దకు చేరుకోవాల్సి రావడం టీడీపీలోనే జేసీ వంటి నేతలకు ఇబ్బందిగా మారుతోంది! ఈ విషయంలో టీడీపీలోని ఇతర సామాజికవర్గ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదేదో కమ్మ వాళ్ల సమావేశం జరిగినట్టుగా.. మీటింగంటే కమ్మ భవన్ కు రావాలా? అని వారు అంటున్నారు. అయితే జిల్లా టీడీపీ నేతల్లో కమ్మ నేతలదే ఆధిపత్యం కాబట్టి.. ఈ విషయంలో ఎవరూ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. బీసీల ఓట్ల మీద ఆధారపడ్డ పార్టీకి మరీ ఇంత కమ్మదనం పనికిరాదని వారు సూచిస్తున్నారు!