అదేదో సామెత ఉంది.. కొండ ముల్లా దగ్గరకు రాకపోతే, ముల్లానే కొండ దగ్గరకు వెళ్లాడన్నట్టుగా. చంద్రబాబు నదుల అనుసంధానం కూడా ఇలాగే ఉంది. జనాల దగ్గరకు నీళ్లు రావడం కాదు, జనాలనే నీళ్లదగ్గరకు తీసుకెళ్తున్నారు! అభినవ భగీరథుడు, మూడో టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాటన్ దొరగా మారిన చంద్రబాబు నాయుడు బృహత్తర నిర్మాణం పట్టిసీమ ప్రహసనంలో ఇదో కొత్త చాప్టర్! ఈ ప్రాజెక్టు విషయంలో వచ్చిన విమర్శలకు ను ప్రచారంతో తిప్పి కొట్టే ప్రయత్నాన్ని ఒకరేంజ్ లో చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పటికే ఆ ప్రాజెక్టును మూడు సార్లు ప్రారంభించింది!
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్నట్టుగా మూడు ఆరంభోత్సవాల అనంతరం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు , నేతలు దశల వారీగా.. అక్కడకు చేరుకుని పూజలు చేస్తూ.. పచ్చ పేపర్లలో పతాక శీర్షికల్లో ప్రచురించుకొంటున్నారు. ఒకవైపు గోదావరి వదర నీరు బంగాళాఖాతంలోకి కలిసిపోతుంటే..ఆ వరద నీటిని కృష్ణలో కలపడానికి వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మాత్రం రోజూ పండగలే!
పట్టిసీమ నిర్మించాకా.. చంద్రబాబు దగ్గరుండి గోదావరి ని కృష్ణతో అనుసంధానం చేశాకా.. కూడా గోదారి నీళ్లు సముద్రం పాలెందుకు అవుతన్నాయి? అనే కామన్ డౌట్ రాకూడదు! ఆ డౌట్ వచ్చిందా.. పట్టిసీమకు మళ్లీ ఇంకో ప్రారంభోత్సం పెట్టేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం! వైఎస్ హయాంలో నిర్మితం అయిన పోలవరం కాలువను ఉపయోగించి పట్టిసీమను కట్టించేశాం, నిర్మించేశాం.. అని రోజూ డాన్సులు చేస్తున్నారు.
అయితే ఈ ప్రహసనం ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే.. పట్టిసీమ వైభవాన్ని జనాలకు చూపడం మొదలుపెట్టారు. మరి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే. .దీని వల్ల ప్రయోజనాలు ఉండుంటే.. ఆ నీళ్లు రాయలసీమ వరకూ వస్తే.. జనాలకే దీని ప్రాధాన్యత ఏమిటో.. చంద్రబాబు విజనేమిటో అర్థం అవుతుంది. అయితే.. అవన్నీ జరిగే పనులు కాదు. అందుకే ఇప్పుడు జనాలను లారీలెక్కించి పట్టి సీమ దగ్గరకు తీసుకెళ్తున్నారు!
ఇలాంటి పరిష్కారాలు కనుగొనడం బహుశా తెలుగుదేశం వాళ్లకే సాధ్యం అవుతుంది కాబోలు! రాయలసీమ ప్రాంతం నుంచి, ఇతర జిల్లాల నుంచి తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. వాహనాలను ఏర్పాటు చేసి జనాలను పట్టిసీమ దగ్గరకు తీసుకెళ్తున్నారు. దాని వైభవాన్ని చూపిస్తున్నారు. చెంబులతో నీళ్లు పోసి.. అనుసంధానం అయిపోయిందని కామెడీ చేసేసి వారి తాజా ఫీటు జనాలనే పట్టిసీమ ప్రాజెక్టు దగ్గరకు తీసుకెళ్లడం. మరి ముందు ముందు ఇంకా ఏమేం చూసి నవ్వులు పండిస్తారో!