మోడీ లైసెన్స్‌తోనే 'కాషాయ' కావరం.!

బీజేపీకి చెందిన మాజీ ఎంపీ ఒకడు.. దేశంలో 'నల్ల - తెల్ల' అనే వివాదానికి తెరలేపాడు. బీజేపీకే చెందిన ఇంకో యువ నాయకుడు, ఓ ముఖ్యమంత్రి 'తల'కి వెల కట్టేశాడు. బీజేపీకి మిత్రపక్షమైన శివసేన ఎంపీ ఒకడు, విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో సిబ్బందిని చెప్పుతో కొట్టి, అదేదో ఘనకార్యమన్నట్టు చెప్పుకున్నాడు.. 

చిత్రంగా, ఈ సందర్భాలన్నిటిల్లోనూ ఏదో ఒక రకంగా ఆయా వ్యక్తుల్ని 'కాషాయదళం' వెనకేసుకొస్తూనే వచ్చింది.. వస్తోంది కూడా.! తమ సిబ్బందిపై సాక్షాత్తూ ఓ ఎంపీ దాడికి దిగిన నేపథ్యంలో, విమానయాన సంస్థలు సదరు ఎంపీపై 'నో ఫ్లై' అంటూ వేటు వేసింది. తర్వాత కేంద్రం ఒత్తిడితో, ఆ వేటుని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 'నలుపు - తెలుపు' వివాదంలో, 'సదరు నేత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి..' అంటూ ఆ వివాదాన్ని కామప్‌ చేసేసింది. మరిప్పుడు, ముఖ్యమంత్రి తలకి వెల కట్టడమేంటట.? ఇక్కడ కూడా, సదరు యువ నేత ఆవేదనను అర్థం చేసుకోవాలట. 

షరామామూలుగానే ఈ మూడు ఘటనలూ పార్లమెంటుని కుదిపేశాయి. ఒకదాన్ని మించిన వివాదం ఇంకోటి. ఇందులో గో సంరక్షణ వివాదాన్ని కూడా ప్రస్తావించాలి. గో సంరక్షణను తప్పు పట్టలేం. కానీ, ఆ పేరుతో హత్యలకు తెగబడటమేంటి.? వర్ణ వివక్ష లేదని చెప్పడానికి, దేశంలోనే వర్ణ వివక్షను తెరపైకి తీసుకురావడమెంతవరకు సబబు.? ఎంపీ అయినంతమాత్రాన, విమాన సిబ్బంది తప్పు చేస్తే చెయ్యి చేసేసుకుంటాడా.? ముఖ్యమంత్రి తీరు నచ్చకపోతే, ప్రశ్నించడం మానేసి తలకు వెలకడ్తాడా.? ఈ ఘటనలన్నిటిలోనూ కన్పించేది 'ఉన్మాదం' మాత్రమే. 

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, ఈ ఉన్మాదాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. అన్నిటికీ 'మోడీ లైసెన్స్‌' వుందనే భావించాలిప్పుడు. ఎందుకంటే, ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ పై ఘటనల్లో దేన్నీ ఇప్పటిదాకా ఖండించలేదు. అసలాయనకు ఖండించాలనే ఆలోచనే వున్నట్లు కన్పించడంలేదు. పైగా, బీజేపీ నేతలు ఈ ఘటనలపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి.! 

భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తారా.? లేదా.? అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే ఈ కాషాయ కావరం కాస్తా ఉన్మాదంగా మారిపోతోంది. అది భారతదేశాన్ని ఎలాంటి విపరీత పరిస్థితుల్లోకి నెట్టేస్తుందో ఏమో.!

Show comments