రొటీనే..చంద్రబాబుకు 'స్టే' కావాలి..!

ఇది వరకూ ఒక భూ  కుంభకోణం విషయంలో.. ఏలేరు స్కామ్ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే “ఓటుకు నోటు’’ కేసు విషయంలో కూడా అనుసరిస్తున్నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఈ కేసు విచారణను నెల రోజుల్లోగా పూర్తి చేయాలన్న ఏసీబీ కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. అందుకు సంబంధించిన పరిణామాలు ఊపందుకుంటున్న క్రమంలో.. ఈ కేసుపై విచారణను నిలిపి వేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున హై కోర్టులో స్టే కోసం పిటిషన్ దాఖలు అయ్యింది.

ఈ మేరకు బాబు తరపున న్యాయవాదులు.. ఈ కేసు విచారణను నిలిపి వేయాలని కోర్టును కోరారు. దీన్ని అత్యవసర విచారణ  లో ఉంచారు. మరి ఆ కేసు నిలవదు.. ఇదంతా కుట్ర.. అంటూనే.. నేను నిప్పును అంటూనే.. తెలుగుదేశం అధినేత స్టే ఆర్డర్ల కోసం ప్రయత్నాలు చేయడం ఆయన బలహీన అని వేరే చెప్పనక్కర్లేదు.

చంద్రబాబు పై అనేక పిటిషన్లు దాఖలు అయినా.. కనీసం విచారణ మొదలు కాకుండానే వాటిల్లో ఆయన స్టే ఆర్డర్లు తెచ్చుకున్నాడనే విమర్శలు కొత్తవేమీ కాదు. స్టే ఆర్డర్లు తెచ్చుకుని.. తనకు తాను నిప్పుని అని చెప్పుకోవడం చంద్రబాబు దిగజారుడు తనం అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే… అలాంటి విమర్శలను పట్టించుకోకుండా.. చంద్రబాబు మరో సారి స్టే వ్యూహాన్నే అనుసరిస్తుండటం గమనార్హం.

ఈ కేసుపై విచారణను ఎదుర్కొని.. క్లీన్ చిట్ ను తెచ్చుకోవాల్సిన నిప్పుగారు.. అసలు విచారణే వద్దంటూ స్టే తీసుకోవడానికి ప్రయత్నిస్తుండటం  ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఈ విచారణలో స్టే ఆర్డర్ వచ్చినా.. చంద్రబాబుపై విమర్శల జడి ఆగే అవకాశాలు ఏమీ లేవు. ఆయన డొంక తిరుగుడుగా ఈ కేసు విచారణను అపాడు కానీ.. క్లీన్ చిట్ తెచ్చుకున్నట్టు కాదు.

కానీ.. హై కోర్టు గనుక స్టే ఆర్డర్ ఇవ్వకపోతే అది చంద్రబాబు అశనిపాతమే అవుతుంది. హై కోర్టు స్థాయిలో బాబు కు చాలా శక్తియుక్తులున్నాయనే ప్రచారం ఉండనే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి!

Show comments