అంతా మాయ.. ఇది చంద్రమాయ.!

మసిపూసి మారేడుకాయని చేయడమంటే ఇదేనేమో.! ఇంకేముంది, జూన్‌ 27.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. ఆ రోజు నుంచి, ఆంధ్రప్రదేశ్‌ నుండే ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన సాగుతుందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే, ఎడాపెడా ప్రభుత్వ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోకి తరలింపబడ్డాయి. హంగు, ఆర్భాటాల నడుమ కొత్త కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 29న సచివాలయానికి మరోసారి ప్రారంభోత్సవం చేసేశారు. 

కానీ, కార్యాలయాలు ఇలా ప్రారంభమయి, అలా క్లోజ్‌ అయిపోయాయి చాలావరకు. క్లోజ్‌ అయిపోవడమంటే పూర్తిగా కాదు, తాత్కాలికంగా. సచివాలయాన్నే తీసుకుంటే, ఉదయం ప్రారంభించారు.. సాయంత్రానికి ఉద్యోగులు హైద్రాబాద్‌కి తిరుగు ప్రయాణమైపోయారు. వివిధ శాఖల కార్యాలయాలోనూ ఉద్యోగుల పరిస్థితి ఇదే. అందరూ అని కాదుగానీ, చాలామంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరుల్లోని కార్యాలయాలకు హాజరు కావడంలేదు. ఇంకో నెలరోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. 

ఇంతలోనే మరో పెద్ద బాంబ్‌ పేలింది. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. 2017 జూన్‌ 2 నాటికి ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతారో, వారందరికీ ఆంధ్రప్రదేశ్‌ స్థానికత వర్తింపజేయాలన్నది రాష్ట్రపతి ఉత్తర్వుల సారాంశం. దురదృష్టవశాత్తూ దానికి స్పష్టతనివ్వలేకపోతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇంకేముంది, ఉద్యోగుల్లో టెన్షన్‌ టెన్షన్‌. 

ఓ పక్క, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల జాతరకు తెరలేపనున్నామంటూ చంద్రబాబు సర్కార్‌ నానా హంగామా చేసింది. ఈలోగా స్థానికతపై కన్‌ఫ్యూజన్‌ మొదటికి వచ్చేసింది. ఇప్పుడిక ఉద్యోగుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. నిరుద్యోగులు, విద్యార్థుల సంగతి సరే సరి. అక్కడేమో కార్యాలయాలు ప్రారంభమైనట్లే ప్రారంభమయి, అటకెక్కేశాయి. సచివాలయంలో మళ్ళీ యధావిధిగా 'నిర్మాణపనులు, అలంకరణ పనులు' కొనసాగుతున్నాయి. 

మంచి ముహూర్తమన్నారు.. గతంలో చంద్రబాబు ఓ సారి సచివాలయానికి ప్రారంభోత్సవం చేశారు. మళ్ళీ ఉద్యోగులు వెళ్ళారు.. ఇంకోసారి ప్రారంభోత్సవం చేశారు. అయినా, సచివాలయం అందుబాటులోకి రాలేదు. ఇంకో నెల రోజుల్లో.. అంటూ ప్రభుత్వం నుంచి వింత వాదన తెరపైకి వస్తోంది. పట్టిసీమ ప్రాజెక్ట్‌ పూర్తి కాకుండానే జాతికి అంకితమైపోయినట్లు.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతినీ అలాగే చేసేశారు చంద్రబాబు. 

ప్రాజెక్టులు వేరు.. రాజధాని వేరు. అన్నిటికీ చంద్రబాబు ఒకటే 'సిద్ధాంతం అప్లయ్‌' చేస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో శిలాఫలకమేసి, మాయమైపోయేవారు నాయకులు. చంద్రబాబు కాస్త వెరైటీ, ఏదీ పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేసేసి 'మమ' అనేసుకోమంటున్నారు. అక్కడేమో అద్దెలు దండగ.. ఇక్కడేమో తరలింపు టెన్షన్‌.. ఇదీ ఇప్పుడు హైద్రాబాద్‌ నుంచి అమరావతికి వెళ్ళాల్సిన ఉద్యోగుల బాధ. ఈ చంద్రమాయకి హద్దూ అదుపూ వుండదా.?

Show comments