బాబు జమానా: ఈ కేసూ, ఆ కేసూ ఒకటేనా.?

కొన్నాళ్ళ క్రితం కాపు ఐక్య గర్జన పేరుతో కాపు సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ఓ రైలు దహనమైపోయింది. తునిలో ఆనాటి విధ్వంసం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పటికీ మరువలేని ఘటన. అత్యంత వ్యూహాత్మకంగా కొందరు దుండగులు ఆ రైలుని తగలబెట్టేశారు. ఇంతకీ, ఆ రైలుని తగలబెట్టిందెవరు.? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. 

అయితే, రైలుని తగలబెట్టింది వైఎస్సార్సీపీకి చెందినవారేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సందర్భాల్లో ఆరోపించారు. ఇప్పటికీ టీడీపీ నేతలు ఇవే ఆరోపణలతో విరుచుకుపడ్తుంటారనుకోండి.. అది వేరే విషయం. ఈ కేసుకు సంబంధించి వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని విచారించారు కూడా. విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. భూమన అరెస్ట్‌.. అంటూ టీడీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడా విచారణ ఏమయ్యిందో ఎవరికీ తెలియని పరిస్థితి. 

ఒకవేళ భూమన హస్తం ఆ ఘటనలో వుండి వుంటే ఇంకేమన్నా వుందా.? ఆ సమయంలో ఆయన్ని వేధించేందుకుగాను ఆ హైడ్రామా అలా నడిపింది చంద్రబాబు సర్కార్‌. మళ్ళీ ఇప్పుడు దాదాపు అలాంటి ఎపిసోడ్‌ ఇంకోటి తెరపైకొచ్చింది. అమరావతిలోని వెలగపూడి పరిపాలనా భవన సముదాయంలో వర్షపు నీరు లీక్‌ అవడం, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి ఆ నీరు ప్రవేశించడం తెల్సిన విషయాలే. ఈ ఘటన వెనుక కుట్ర కోణం దాగి వుందని టీడీపీ ఆరోపిస్తోంది. 

సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌, 'కుట్రకోణాన్ని' తెరపైకి తీసుకురావడం గమనార్హం. మరోపక్క, సీసీటీవీ ఫుటేజ్‌లలో కొందరు వ్యక్తుల వర్షం కురిసిన సమయంలో ఆ భవనం పైకి వెళ్ళారంటూ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. ఇదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. చూస్తోంటే రైలు దహనం కేసు తరహాలోనే ఇప్పుడూ పొలిటికల్‌ విచారణ తెరపైకొచ్చేలా వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  Readmore!

తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి సమస్యను పక్కదారి పట్టించడం చంద్రబాబు సర్కార్‌కి వెన్నతో పెట్టిన విద్యే. అసెంబ్లీ భవనంలో లీకేజీపై 'కుట్రకోణం' అనే అనుమానాలు తెరపైకి తెచ్చారు సరే.. మిగతా భవనాల్లోకి వర్షపు నీరు రావడం సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.

Show comments