రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో (ఢిల్లీలో) పార్లమెంటు, రాష్ట్రాల్లో అసెంబ్లీలు అత్యున్నత చట్టసభలు. ప్రజా సమస్యలకు పరిష్కార వేదికలు. పార్లమెంటు దేశ భవిష్యత్తును, అసెంబ్లీలు రాష్ట్రాల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. చట్టసభలను కొందరు 'పవిత్ర దేవాలయాలు' అంటుంటారు. పార్లమెంటును, అసెంబ్లీలను రాజ్యాంగం అత్యున్నత చట్టసభలుగా పేర్కొన్నా, కొందరు దేవాలయాలన్నా అంతటి అత్యున్నతత్వం , పవిత్రత వీటిల్లో కనబడటంలేదనేది వాస్తవం. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో చట్టసభలు హుందాగా పనిచేశాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలిచాయి. ఆరోగ్యకరమైన, ఆలోచింపచేసే చర్చలు జరిగాయి. ఆ తరువాత క్రమంగా దిగజారాయి. చట్టసభలు చట్టుబండలయ్యాయి. తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి వేదికలయ్యాయి. ప్రజా సమస్యపై చర్చలు ఎప్పుడోతప్ప కనబడటంలేదు. ఎక్కువ చట్టసభలు ఘర్షణలకు నిలయాలుగా మారాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలూ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే తమిళనాడు అసెంబ్లీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలు ఘర్షణ పడతాయేయోగాని ఈ అసెంబ్లీ ఎక్కువగా భజన మందిరాన్ని తలపిస్తుంటుంది. డీఎంకే ప్రభుత్వమున్నా, అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా సరే భజనపరులకు, భక్తులకు చేతినిండా పని ఉంటుంది. సాదారణంగా తమిళ రాజకీయాలే చిత్రంగా ఉంటాయి. సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా 'వీరాభిమానం' ఈ రాష్ట్రం ప్రత్యేకత. ఇక్కడ బహిరంగ సభల్లో, సమావేశాల్లో, ప్రెస్‌మీట్లలో అధినేతల, ముఖ్యమంత్రి (ఎవరు అధికారంలో ఉంటే వారు) భజన సాగుతూనే ఉంటుంది. ఇది చాలదన్నట్లుగా అసెంబ్లీలోనూ భజన కొనసాగిస్తూనే ఉంటారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె భజన, కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు ఆయన భజన సాగాయి. అసెంబ్లీలో భజనలను, దండకాలను ఇద్దరూ ప్రోత్సహించినవారే. జయలలిత మరణించాక కూడా అసెంబ్లీలో అన్నాడీఎంకే మంత్రుల, ఎమ్మెల్యేల భజన ఆగడంలేదు.
అంటే ముఖ్యమంత్రి పన్నీరు శెల్వం భజన చేస్తున్నారని అనుకుంటున్నారా? అబ్బే...కాదండి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భజన చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎంను పొగుడుతున్నారంటే ఏదో తప్పదులే అనుకోవచ్చు. కాని శశికళ స్తోత్రం చేయడం అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించినట్లు కాదా? అవునని ఎవరైనా అంటారు. కాని అన్నాడీఎంకేవారికి అదేం పట్టదు. తాజాగా అసెంబ్లీలో మంత్రులు శశికళను సుదీర్ఘంగా పొగడటాన్ని ప్రతిపక్ష డీఎంకే తప్పుపట్టింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ భజన కార్యక్రమం సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు చేయాల్సిన పనేమిటి? సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం. కాని వారు ఆ పనికి ప్రాధాన్యం ఇవ్వకుండా చిన్నమ్మను సుదీర్ఘంగా పొగిడారు. మంత్రులు ఇలా చేసినప్పుడు స్పీకర్ ఏం చేయాలి? అసెంబ్లీలో భజన చేయడం తప్పని, అందులోనూ ప్రభుత్వంలో భాగం కాని వ్యక్తిని పొగడటం తగదని చెప్పాలి.
కాని స్పీకర్ ధనపాల్, ముఖ్యమంత్రి పన్నీర్‌శెల్వం మంత్రుల పనిని సమర్ధించారు. దీంతో చిరెత్తుకొచ్చిన ప్రతిపక్ష నేత స్టాలిన్ తీవ్ర అభ్యంతరం తెలియచేశారు. దీంతో స్పీకర్ 'అయ్యా..ఎవరి అధినేతను వారు పొగడుకునే హక్కుంది. కావాలంటే మీ అధినేతను మీరూ పొగుడుకోండి. అభ్యంతరం లేదు' అని చెప్పారు. 'మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులూ ఇలాగే చేశారు' అని సీఎం పన్నీరు శెల్వం చురకలంటించారు. అప్పుడు స్టాలిన్ వితండవాదం చేయకుండా 'కరెక్టే మేం ఈ పనే చేశాం. అప్పుడు మేం చేసిన తప్పును మీరు ఎందుకు కొనసాగించాలి?' అని ప్రశ్నించారు. చివరగా మంత్రులు, ప్రజాప్రతినిధులు అధినేతలను పొగడుకోవడం తప్పు కాదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. జయలలిత భక్తాగ్రేసరులైన నాయకులంతా ఆమె ప్రాణం పోయిందని తెలియగానే చిన్నమ్మకు దాసానుదాసులైపోయారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకముందే భజన ప్రారంభించారు. భజన ప్రారంభమే 'హైపీచ్'లో ఉంది. ఆమె ముఖ్యమంత్రి అయితే ఇంకెంత పతాకస్థాయికి వెళుతుందో. శశికళపట్ల అన్నాడీఎంకే నాయకులు 'అతి భక్తి' ఆమె వ్యతిరేకులకు అసహ్యం కలిగిస్తోంది. 'నాయకులు జయను అప్పుడే మర్చిపోయారు' అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. నాయకులు జయలలిత దగ్గరకు వెళ్లినప్పుడు చొక్క జేబులో ఆమె ఫోటో పెట్టుకొని వెళ్లేవారు. వీరు పల్చటి తెల్లచొక్కాలు వేసుకుంటారు కాబట్టి జేబులోని ఫొటో బయటకు కనబడుతూ ఉంటుంది. జయను ఇంప్రెస్ చేయడంలో ఇదొక భాగం. ఇప్పుడు చొక్కా జేబులో శశికళ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇదీ వీరి తీరు.