ఓ మై గాడ్’.. కమల్ ఇప్పుడు రీమేకా..!

అదేంటో సొంతంగా ఎంతో టాలెంట్ ను పుష్కలంగా కలిగి ఉన్నప్పటికీ కమల్ హాసన్ కు రీమేక్ ల పిచ్చి ఒకటి ఉంది. సొంతంగా మంచి మంచి సినిమాలు చేసే టాలెంట్ ఉన్నా ఒక్కోసారి ఏవో సినిమాలను తన స్టైల్లో చేసి చూపిస్తూ ఉంటాడు. గత కొన్నేళ్లలో ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ ‘ఏ వెన్స్ డే’ వంటి హిందీ సినిమాలను ‘దృశ్యం’ వంటి మలయాళం సినిమాలను తమిళంలో రీమేక్ చేశాడు కమల్. వీటిల్లో వెన్స్ డే సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. 

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కమల్ మరో రీమేక్ కు రంగం సిద్ధం చేస్తున్నాడట. అది ‘ఓ మై గాడ్’ సినిమాను. హిందీలో ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో చెప్పనక్కర్లా. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. ఒక గుజరాతీ నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా.. మ్యాజికల్ రియలిజంను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. కమర్షియల్ గా లాభాలను చవి చూసింది. ఈ నేపథ్యంలో వివిధ భారతీయ భాషల్లో ఈ సినిమా రీమేక్ అయ్యింది. తెలుగులో ‘గోపాలా గోపాలా’గా వచ్చింది ఈ సినిమా. 

కన్నడలో కూడా ఈ మధ్యనే రీమేక్ చేశారు. ఇలా ఎన్ని రీమేక్ లు వచ్చినా.. ఒరిజినల్ అంత బెస్ట్ రాలేదు. దీంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఒరిజినల్ ను బాగా చూశారు. అంతలా ఆ సినిమాను పండించారు పరేష్, అక్షయ్ లు. ‘ఓ మై గాడ్’ వచ్చి కూడా ఇప్పటికే నాలుగైదేళ్లు అయినట్టుంది. మరి ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయడం అంటే.. ఒకింత అనాసక్తి వ్యవహారమే. చేస్తే తమిళులు, మలయాళీల కోసం చేయాలి. హిందీలో పరేష్ చేసిన పాత్రలో కమల్, అక్షయ్ చేసిన పాత్రలో మోహన్ లాల్ నటించనున్నాడట. వీళ్ల కాంబోలో ఆ సినిమా ఆసక్తికరమే కానీ.. రీమేక్ కే చాలా లేట్ అయ్యిందేమో అని!

Show comments