'ముందస్తు'పై బాబుకు పక్కా సమాచారం ఉందా?

పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఆ విషయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందే తెలుసుని మీడియా కోడై కూసింది. నోట్ల రద్దుకు ముందు హెరిటేజ్‌కు సంబంధించి ఆయన కుమారుడు లోకేష్‌ చేసిన భారీ డీల్‌ నోట్ల రద్దు విషయం ముందే తెలుసనే  అనుమానాలకు, ఆరోపణలకు ఆస్కారమిచ్చింది. నిజమెంతో తెలియదు. తాజాగా చంద్రబాబు 'సార్వత్రిక ఎన్నికలు గడువు కంటే ముందే జరుగుతాయి. అందరూ సిద్ధంగా ఉండాలి'...అని తన పార్టీ నాయకులకు చెప్పారు. దీన్ని సాధారణ సమాచారంగా చూడకూడదు. పక్కా సమాచారం ఉన్నట్లుగానే చెప్పారు. 2018 చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీన్నిబట్టి చూస్తే ముందస్తు ఎన్నికలపై కూడా ఆయన దగ్గర కచ్చితమైన సమాచారం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ ముందస్తు ఎన్నికల జ్వరంతో ఉన్నాయి. దేశమంతా ఒకేసారి ఎన్నికలు (లోక్‌సభకు, అసెంబ్లీలకు) జరపాలని ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదన పెద్ద చర్చకు దారితీసింది.

దీనిపై తెలుగు ముఖ్యమంత్రులిద్దరూ సుముఖంగా ఉన్నారు. ముందుగా ఎన్నికలు జరగడం తమకు ప్రయోజనకరమని అనుకుంటున్నారు. కేసీఆర్‌ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించడం, రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ పథకం ప్రకటించడం ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిన పనులే. రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కాగానే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై మోదీ దృష్టి పెడతారని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ ఏ పనైనా మొండిగా చేసే రకం. నోట్ల రద్దు, రైల్వే బడ్జెటును సాధారణ బడ్జెటులో కలిపేయడం, బుగ్గ కార్ల వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడటం...మొదలైనవన్నీ అనుకున్న పని చేస్తాడనేదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆయన ప్రతిపాదన కార్యరూపం దాల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది వంద శాతం జరిగితీరుతుందని చంద్రబాబు భావిస్తున్నారేమో....!

ప్రతి విషయంలో గొప్పలు చెప్పుకునే, హైప్‌ క్రియేట్‌ చేసే ముఖ్యమంత్రి టీడీపీ ఓటింగ్‌ షేర్‌ పెరిగిందని కూడా చెప్పుకున్నారు. 'పచ్చ' పార్టీ ఓటింగ్‌ షేర్‌ గత ఎన్నికలతో పోలిస్తే 16.13 శాతం పెరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం 13.45 శాతం పడిపోయిందట. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ టీడీపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ పెరుగుదలకు, తరుగుదలకు ఆధారాలేమిటో చెప్పలేదు. అంకెల్లో అభివృద్ధిని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన చెప్పింది నిజమో కాదో ఎలా నిర్థారించుకుంటారు? ఇదిలా ఉండగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ నుంచి వ్యతిరేకత లేదు. 'ఒకేసారి ఎన్నికలు' ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం గతంలో ప్రకటించింది. పార్లమెంటు  గడువు అయిపోగానే దానికి, రాష్ట్రాల అసెంబ్లీల గడువు అయిపోగానే వాటికీ జరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడితే పార్లమెంటుకుగాని, అసెంబ్లీలకుగాని మధ్యంతర ఎన్నికలూ జరగొచ్చు. అంటే ఏడాది పొడుగునా ఎక్కడో ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇవిగాక ఉప ఎన్నికలు అదనం. ఇదంతా చికాకుగా ఉందనే అభిప్రాయం కలుగుతోంది.

అందుకే దేశ వ్యాప్తంగా ఒక్కసారే (పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి) ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఒక్కసారే ఎన్నికల నిర్వహణ కారణంగా ఖర్చు కలిసివస్తుందని, ఐదేళ్ల వరకూ దేశంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించే బెడద ఉండదని, ఇతరత్రా ప్రయోజనాలున్నాయని కొందరు రాజకీయ నాయకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సివుంటుంది. ఈ విధానానికి చాలా రాష్ట్రాలు, పార్టీలు సుముఖంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీమ్‌ జైదీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమేనని గత ఏడాది డిసెంబరులో ప్రకటించి ప్రభుత్వాలని, పార్టీలను ఆలోచనలో పడేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ కేంద్రన్యాయశాఖకు, ఈ అంశాన్ని పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసినట్లు జైదీ చెప్పారు.

Show comments