బోయపాటి 103 నా 104 నా?

బాలయ్య చకచకా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. నిన్నగాక మొన్న వందో సినిమా వచ్చింది అనుకుంటే, అప్పుడే 101 ఫినిష్ చేసి, 102 ను స్టార్ట్ చేసేసారు. పైగా ఆ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్, చకచకా ఆ సినిమాను ఫినిష్ చేసి, సంక్రాంతి బరిలోకి దింపి తీరుతా అంటున్నారట. అంటే పవన్, మహేష్ లకు బాలయ్య కూడా సంక్రాంతి పోరుకు సై అంటారన్నమాట. అయినా అది వేరే సంగతి.

ఇదిలా వుంటే 103వ సినిమా డైరక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు పాయింట్. బోయపాటి అయితే బాలయ్యతో ఓ సినిమా చేయాల్సి వుంది. ప్రస్తుతానికి ఆయన జయ జానకీ నాయక సినిమా పూర్తి చేసారు. చిరంజీవి కోసం బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసారు. కానీ చిరంజీవి ఇప్పట్లో అందుబాటులో వుండడం లేదు.

ఇక మిగిలింది బాలయ్య తో సినిమా. కానీ బాలయ్య ఎలాగైనా తన 103వ సినిమాను జనవరిలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. మరి ఆ టైమ్ కు బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేయాలి కదా? అదీ సమస్య. బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేయాలంటే కనీసం ఆరు నెలల సమయం కావాలి. సంక్రాంతి వేళ్లకు బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేయగలరా? అలా రెడీ చేస్తే, నిర్మించడానికి మైత్రీ మూవీస్ రెడీగానే వుంది. కానీ జనవరి నుంచి మాత్రం కాదు. ఆ సంస్థ నిర్మిస్తున్న పెద్ద సినిమా.

ఇదిలా వుంటే బాలయ్య తన 103వ సినిమా బోయపాటి కాకుండా వేరే దర్శకుడితో చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడి విషయంలో బాలయ్య క్లారిటీగానే వున్నారని, కానీ ఇంకా బయటకు పూర్తిగా రాలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. మరి అదే నిజమైతే బోయపాటి 104వ సినిమాకు ఫిక్స్ కావాల్సి వుంటుంది.

కానీ అప్పుడు బోయపాటి లైన్ ఆఫ్ ఆర్డర్ అంతా దెబ్బతింటుంది. చిరు, అఖిల్ తో కూడా సినిమాలు చేయాలనుకుంటున్న ఆయన లెక్కలు మారిపోతాయి.

Show comments