వైఎస్సార్‌ లేని లోటు తెలిసొచ్చిందా.?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి లేని లోటు కాంగ్రెస్‌ పార్టీకి తొలిసారిగా తెలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నష్టపోయినందుకు కాదు, తెలంగాణలో కాంగ్రెస్‌ దెబ్బ తింటున్నందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ఉలిక్కిపడింది. 

''వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వుండి వుంటేనా.? కేసీఆర్‌ నాయకుడిగా ఎదిగేవాడే కాదు.. అసలు ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయేదే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నష్టపోయేది కాదు.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇబ్బందులు ఎదుర్కొనేదే కాదు..'' అంటూ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, 'విభజన మేధావి' జైరాం రమేష్‌ తాజాగా అసలు విషయం బయటపెట్టారు. 

''కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ కూడా ఓ నాయకుడు మాత్రమే.. కాంగ్రెస్‌ పార్టీనే ఆయన్ని నాయకుడిగా మలచింది.. కాంగ్రెస్‌లో ఎంతో మంది నేతలు ఎదిగారు.. అందులో వైఎస్‌ కూడా ఒకరు.. అంతకు మించి, వైఎస్‌ని ప్రత్యేకంగా చూడలేం..'' ఈ మాటలు అన్నది ఎవరో కాదు జైరాం రమేష్‌గారే. అది గతం. ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తే జైరాం రమేష్‌కీ, కాంగ్రెస్‌ పార్టీకీ వైఎస్‌ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే, వైఎస్‌ని స్మరించుకుంటోంది కాంగ్రెస్‌ అధిష్టానం. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించడం కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే.. అని ఇప్పటికి జైరాం రమేష్‌ ఒప్పుకున్నారు. నిన్న మొన్నటిదాకా ఆయన మాట తీరు వేరు. విభజించి ఆంధ్రప్రదేశ్‌కీ తెలంగాణకీ మేలు చేశాం.. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజల మనసుల్ని గెలుచుకుంటాం.. అని చెప్పారాయన. ఇవి కేవలం జైరాం రమేష్‌ మాటలుగా మాత్రమే చూడలేం.. కాంగ్రెస్‌ అధిష్టానం తెలుగు రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహనకు వచ్చాకే ఈ వ్యాఖ్యల్ని జైరాం రమేష్‌ చేత చేయించిందనే విషయం స్పష్టమవుతోంది.  Readmore!

ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించడం మాటెలా వున్నా, వైఎస్‌ జగన్‌ మీద అక్కసుతో వైఎస్‌ ఇమేజ్‌ని పార్టీకి దూరం చేసుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే. జగన్‌ని కాంగ్రెస్‌లో అందలం ఎక్కించి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. జగన్‌ని రాజకీయంగా అణగదొక్కేందుకు కాంగ్రెస్‌ పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌ మర్చిపోవాలనుకుంటున్నట్లుంది. ఏమో, వైఎస్‌ జగన్‌కి ఇప్పుడు కాంగ్రెస్‌ గాలం వేసినా వేయొచ్చుగాక.! 

కానీ, జరిగిన అన్యాయాన్ని.. తనను కాంగ్రెస్‌ వేధించిన వైనాన్నీ జగన్‌ మాత్రం మర్చిపోలేరుగాక మర్చిపోలేరు. కాంగ్రెస్‌ కాళ్ళ బేరానికి వచ్చినా, జగన్‌ కాంగ్రెస్‌ని క్షమిస్తారా.? ఛాన్సే లేదు. ఇక, తెలంగాణ విషయానికొస్తే.. ఇప్పుడు జైరాం రమేష్‌ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌కి కొత్త ఊతమివ్వవు సరికదా.. ఇంకా ఆ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టేయడం ఖాయం. గతం అనవసరం. ప్రస్తుతం ఏంటన్నదే ఇప్పుడు అందరికీ ముఖ్యం. తెలంగాణలో కేసీఆర్‌ తిరుగులేని నాయకుడు. అసలతను నాయకుడే కాదనడం జైరాం రమేష్‌ లాంటి సీనియర్‌ పొలిటీషియన్‌కి తగదు.

Show comments

Related Stories :