విడాకులకు కసరత్తు ప్రారంభమైందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇక బీజేపీ-టీడీపీ కలిసి కాపురం చేయడం సాధ్యం కాదని సామన్య జనం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అభిప్రాయపడుతున్నారు. విడాకులు తప్పవని టీడీపీ, బీజేపీ నాయకులే పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబుతున్నారు. ఈ రెండు పార్టీల్లోని కొందరు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతుంటే, ఇంకొందరు సంకేతాలిస్తున్నారు. ఏది ఏమైనా బంధం నిలిచేది కాదని రెండు పార్టీల నాయకులు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు రాజకీయ పరిణామాలు, నాయకుల వ్యాఖ్యలు, పరస్పర విమర్శలు సూచిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెసును అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారని, మోదీని ఓడించే కుట్ర చేస్తున్నారని ఈమధ్య  ఆంధ్రా బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విమర్శించారు. ఈ మాట చాటుమాటుగా కాదు నేరుగానే అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే అగాధం మరింత పెద్దదవుతోందని, వివాదం ముదురు పాకాన పడుతోందని అర్థమవుతోంది. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలడం ఇప్పుడు కొత్తకాదు. చాలాకాలం నుంచి జరుగుతూనే ఉంది.

విడాకులు తప్పవనే సంకేతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంతకాలంగా ఢిల్లీకి పంపుతున్నారు. రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం ఎక్కువవుతున్న కొద్దీ అగాధం కూడా పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం...బీజేపీతో విడాకులు తీసుకునేందుకు టీడీపీ అధినేత కసరత్తు ప్రారంభించారు. బంధం ఎప్పుడు తెంపుకోవాలి? సరైన సమయం ఏమిటి? దోస్తీ వదులుకుంటే  పార్టీకి, రాష్ట్రానికి కలిగే లాభనష్టాలేమిటి? వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి?...ఇలాంటి అంశాల మీద గామ్ర స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారట...! ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం. టీడీపీ శ్రేణులు బంధం తెంపుకుంటేనే ప్రయోజనకరమని అభిప్రాయపడుతున్నాయట. సర్కారు ఎంతగా ప్రాధేయపడుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు కాబట్టి ప్రజలకు ఇదొక సెంటిమెంటుగా మారిందని, బీజేపీపై అసహనంగా ఉన్నారని, అందువల్ల ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. 

ఇప్పటికిప్పుడు విడిపోతే కేంద్రం నుంచి సాయం ఆగిపోవడమే కాకుండా, రకరకాల కారణాలతో సర్కారును వేధించే అవకాశం ఉంది కాబట్టి ఎలాగోలా మేనేజ్‌ చేసుకొని ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడ్‌బై చెప్పడం మంచిదని పార్టీ వర్గాలు అధినేతకు సలహా ఇస్తున్నాయట. బీజేపీతో బంధం కారణంగా కొన్ని సామాజిక వర్గాలు (ప్రధానంగా ముస్లింలు) పార్టీకి దూరమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తే ఆ సామాజిక వర్గాలు ఇతర పార్టీలకు (ప్రధానంగా వైసీపీ) మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని పచ్చ నేతలు చెబుతున్నారు. 

కేంద్రం తాజాగా చేసిన ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రే పెదవి విరిచారు. ఈ డబ్బు కేబుళ్లు వేసుకోవడానికి కూడా సరిపోదన్నారు. ముఖ్యమంత్రే అలా అనేసరికి తమ్ముళ్లు రెచ్చిపోయి కేంద్రం ముష్టి వేసిందన్నారు. ఈ పరిణామాలన్నీ విడిపోవడానికి సంకేతాలుగా కనబడుతున్నాయి. టీడీపీతో సంబంధాలు సజావుగా లేవని ప్రధాని మోదీకి, కాషాయం అధ్యక్షుడు అమిత్‌ షాకు, మంత్రులకు తెలుసు. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అనుకుంటూనే ఉన్నారు. ఈమధ్య కాలంలో చంద్రబాబుతో మోదీ మాట్లాడిన తీరు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  మాట్లాడిన తీరు, తాజాగా చేసిన అరకొర సాయం...ఇలాంటివన్నీ చూస్తుంటే 'కాని పెళ్లికి బాజాలెందుకు?' అన్నట్లుగా ఉంది. ఎలాగూ కలిసివుండని పరిస్థితి ఉన్నప్పుడు భారీగా ఎందుకు సాయం చేయాలని కేంద్రం భావిస్తున్నదేమో....! 

టీడీపీ-బీజేపీ ఎంత తొందరగా విడిపోతాయా అని ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. సాధ్యమైనంతవరకు రెచ్చగొడుతున్నాయి. 'చంద్రబాబుకు సిగ్గు శరం లేదు' అన్న ధోరణిలో ఎగదోస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన ప్రత్యేక హోదాపై గట్టిగా పట్టుబడుతున్నట్లుగా కనబడుతోంది. ఇదివరకు హోదా సంజీవిని కాదన్న బాబు ఇప్పుడు జీవన్మరణ సమస్య అంటున్నారు. 'చంద్రబాబు ప్రతిపక్షాల ఉచ్చులో పడిపోయారు' అని ఈమధ్య టీడీపీ అనుకూల పత్రిక వ్యాఖ్యానించింది. 

తక్కువ ప్రయోజనాలిచ్చే ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు సాధించుకునేలా ప్రయత్నాలు చేయాలని సలహా ఇచ్చింది. తాజాగా ఓ విశ్రాంత విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఇప్పటి పరిస్థితిలో ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఉపయోగం లేదంటూ ఓ పత్రికలో వ్యాసం రాశారు. చివరకు రాష్ట్రానికి హోదా రాకపోవడమే కాకుండా అరకొర సాయంతోనే దోస్తీ ముగిసిపోయేలా ఉంది. 

Show comments