పవన్‌కళ్యాణ్‌ చంటిపిల్లాడటండీ.!

పాపం చంటి పిల్లోడు.. అవును, పవన్‌కళ్యాణ్‌ చంటి పిల్లోడే. పాపం ఆ చంటి పిల్లోడ్ని కొందరు తప్పుదోవ పట్టించేస్తున్నారు. అందుకే పవన్‌కళ్యాణ్‌, ఇంకా ప్రత్యేక హోదా.. అంటూ అర్థం పర్థం లేని డిమాండ్‌ చేస్తున్నారట. ఈ మాటలన్నదెవరో కాదు, 'అపరిచితుడు' విష్ణుకుమార్‌రాజు. బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తుంటారు గనుక, ముద్దుగా ఆయన్ని కొందరు 'అపరిచితుడు' అని పిలుచుకుంటుంటారు. 

ఓ సారి చంద్రబాబు భజన చేస్తారు, ఇంకోసారి పవన్‌కళ్యాణ్‌ని ఆకాశానికెత్తేస్తారు, మరోసారి వైఎస్‌ జగన్‌ని ప్రశంసిస్తారు. అందుకే, విష్ణుకుమార్‌రాజుకి 'అపరిచితుడు' అనే పేరొచ్చింది. బీజేపీ నేతలంతా కట్టగట్టుకుని, పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్న వేళ, విష్ణుకుమార్‌రాజు చిత్రంగా, 'పవన్‌కళ్యాణ్‌ మంచోడే.. గత ఎన్నికల్లో మాకు మద్దతిచ్చారు.. ఆయన చేసిన మేలుని మర్చిపోలేం.. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు మేము.. పవన్‌కళ్యాణ్‌ని 2019 ఎన్నికల దాకా గుర్తుపెట్టుకుంటాం..' అని విష్ణుకుమార్‌ రాజు తాజాగా సెలవిచ్చారు. 

బీజేపీ ఎప్పుడో పవన్‌కళ్యాణ్‌ అనే తెప్పని తగలేసేసింది. అసలు పవన్‌ రాజకీయ నాయకుడే కాదని, బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్థనాథ్‌సింగ్‌ విమర్శించేశారు. అసలు పవన్‌ కళ్యాణ్‌కి రాజకీయం అంటే తెలుసా.? పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప, పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లో ఎందుకూ పనికిరాడని బీజేపీ నేతలు నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారు. పాపం, విష్ణుకుమార్‌ రాజుకి అవన్నీ విన్పించి వుండవు. ఏమో, విన్పించి కూడా విన్పించనట్టు మళ్ళీ విష్ణుకుమార్‌రాజులో ఇది ఇంకో అపరిచితుడి రూపమేమో.! 

'పాచిపోయిన లడ్డూలతో' ప్రత్యేక ప్యాకేజీని పవన్‌ పోల్చినప్పటినుంచి, బీజేపీ - పవన్‌కళ్యాణ్‌ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి సాక్షిగా, ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్రమోడీ చెప్పిన విషయాన్నే పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా హామీ నరేంద్రమోడీ ఇచ్చారు కాబట్టే పవన్‌కళ్యాణ్‌ బీజేపీకి 2014 ఎన్నికల్లో మద్దతిచ్చారు. అటు ప్రత్యేక హోదా అనే తెప్పని తగలేసి, ఇటు పవన్‌కళ్యాణ్‌ అనే మరో తెప్పని తగలేసిన బీజేపీ, కామెడీగా పవన్‌కళ్యాణ్‌ని చిన్నపిల్లోడ్ని చేసేసింది. పాపం పవన్‌కళ్యాణ్‌, గట్టిగా స్పందిద్దామంటే ఆయనగారి ట్విట్టర్‌ పిట్ట మూగబోయిందాయె.! 

చేసుకున్నోడికి చేసుకున్నంత.. నరేంద్రమోడీని నమ్మితే నట్టేట్లో మునుగుడేనని పవన్‌కళ్యాణ్‌కి ఇప్పటికన్నా అర్థమయ్యిందో లేదో మరి.

Show comments