ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీజేపీకి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి.. ఇప్పటి కమలనాథులకు చాలా తేడా వచ్చిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో తప్పులు ఇప్పుడు రైట్లు, ఇప్పటి రైట్లు అప్పటికి తప్పులు. అధికారంలోకి వస్తే అండపిండబ్రహ్మాండం అదిరిపోతుందని చెప్పి... విదేశాల్లో నల్లధనం, ఒక్కోరి అకౌంట్లలోకి లక్షల రూపాయలు యాడ్ అవుతుందని ఊరించి.. ఊహాలోకంలో ముంచెత్తి కమలనాథులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
మోడీ అండ్ కో చూపిన అరచేతిలో వైకుంఠానికి భారతీయులు అప్పట్లో ఒక రేంజ్ లో ఆనందపడిపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోడిఫికేషన్ మొదలైంది! అప్పట్లో ఆధార్ తప్పు అనిపించింది మోడీకి.. అదొక అర్థంలేని వ్యహారం అన్నారు. ఇప్పుడు ఆధార్ లేనిదే ఏమీ లేదని చెబుతున్నారు. అప్పట్లో విదేశాల్లో నల్లధనం లక్షల కోట్లలో మూలుగుతూ ఉందన్నారు... ఇప్పుడు దాని పేరెత్తితే కమలనాథులు మూలుగుతున్నారు.
అప్పట్లో గంగ ప్రక్షాళన అన్నారు... ఇప్పుడు అది సాధ్యం కాదని చేతులెత్తేశారు. ఇలా చెబుతూపోతే బొచ్చెడు మార్పులు వచ్చాయి. ఈ లెక్కలో జీఎస్టీ ఒకటి. ఈ అర్ధరాత్రి నుంచి అమలు కానున్న జీఎస్టీ విషయంలో గతంలో కమలనాథులు చేసిన ప్రకటనలు ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ అప్పట్లోనే జీఎస్టీ తీసుకొస్తామని చెప్పింది. దేశభక్తి ఫ్లేవర్ లేకుండా కాంగ్రెస్ ఈ ఆర్థిక సంస్కరణను తీసుకొస్తానంటే కమలనాథులు గయ్యిమన్నారు.
అప్పటికి జాతీయ రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన మోడీ వీరలెవల్లో శివాలెత్తారు. జీఎస్టీ అమలు సాధ్యం కాదు అని ఒక్క మాటతో తేల్చేశారు. అందుకు సంబంధించి బోలెడన్ని ప్రసంగాలు కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు వాటినే ప్రస్తావిస్తున్నారు.
అసలు జీఎస్టీ అమలు సాధ్యం కాదు అన్నారు కదా.. ఇప్పుడేంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము జీఎస్టీ అమలు నేపథ్యంలో జరగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి వచ్చే ప్రసక్తే లేని వారు తేల్చి చెబుతున్నారు. అయితే కమలనాథులు మాత్రం ఇప్పుడు జీఎస్టీ ఒక విప్లవం అంటూ కహానీలు చెబుతున్నారు.