సొంత మనుషుల కోసం: దాసరి

పుట్టినరోజు వేడుకల్లో దాసరి నారాయణరావు ఉత్సాహంగా కన్పించారు. ఇదివరకటితో పోల్చితే 'జోష్‌' తక్కువగా వున్నట్లు కన్పించినా, అల్లు రామలింగయ్య పురస్కారం అందుకున్న సమయంలో దాసరి చాలా చాలా ఉత్సాహంగా కన్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్నాళ్ళ క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దాసరి, శస్త్ర చికిత్స అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే వుండాల్సి వచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత దాసరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. 

ఇక, అల్లు రామలింగయ్య పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన దాసరి, అల్లు రామలింగయ్యతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. తన దర్శకత్వంలో అల్లు రామలింగయ్య ఎక్కువ సినిమాలు చేశారనీ, ఆయన కోసం పాత్ర సృష్టించకుండా కథ రాసుకోలేకపోయేవాడినని అన్నారు దాసరి. అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్‌, అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్‌ చిరంజీవి 'అల్లు రామలింగయ్య స్మారక పురస్కారాన్ని' దాసరి నారాయణరావుకి అందించారు. 

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో వున్న సమయంలోనూ దాసరి, తన 150వ సినిమా గురించి వాకబు చేశారనీ, 'ఖైదీ నెంబర్‌ 150' వసూళ్ళ గురించి అడిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. దాసరి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు చిరంజీవి. 

'ఇది సొంత మనుషుల అవార్డు.. అందుకే, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా..' అని దాసరి వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తమ్మీద, దాసరి ఈజ్‌ బ్యాక్‌. సంపూర్ణ ఆరోగ్యంతో దాసరి మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమలో 'పెద్దన్న'గా తన ప్రత్యేకతను చాటుకుంటారని దాసరిని ఈ రోజు పుట్టినరోజు వేడుకల్లో కలిసి అభినందించిన సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments