ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మొదటి నుంచీ చాలా అనుమానాలున్నాయి. అసలు ఆ ప్రదేశం రాజధానికి ఏమాత్రం అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. భూకంపాలు సంభవించే ప్రాంతమంటూ నిపుణుల అభిప్రాయాలు వుండనే వున్నాయి. ముంపు ప్రాంతమనీ, ఇంకోటనీ.. ఇలా సవాలక్ష వాదనలున్నా దేన్నీ చంద్రబాబు సర్కార్ లెక్కచేయలేదు.
జపాన్ అతి తీవ్ర భూకంపాల జోన్‌లో వున్న మాట వాస్తవం. అయినా, అక్కడ అభివృద్ధి, అత్యద్భుతమైన భవనాలూ వున్నాయన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ముంపు ప్రాంతానికీ ప్రత్యామ్నాయాలు చూడొచ్చు. అయితే, ఇక్కడ అనుమానం రాజధాని ప్రాంతం మీద కాదు, పాలకుల మీద. అమరావతి ఎంపికలో ఎలాంటి శాస్త్రీయతా పాటించలేదన్న విమర్శలు ఎప్పటినుంచో వెల్లువెత్తుతున్నాయి. అది అమరావతికి వ్యతిరేకంగా మాత్రమేనంటూ అధికార పక్షం, ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసేసి ఊరుకుందంతే.
ఇక, తాజాగా అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో కొంత భూమి కుంగుబాటుకు గురయ్యిందంటూ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. అయితే అది కుంగుబాటు కాదంటూ అధికారులు క్లారిటీ ఇచ్చారనుకోండి.. అది వేరే విషయం. శరవేగంగా నిర్మాణాల్ని పూర్తి చేసే క్రమంలో, ఏ చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా.. అది తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయన్నది నిర్వివాదాంశం. అమరావతి నిర్మాణానికి సంబంధించి వివిధ పనుల్లో ఇప్పటిదాకా ఇద్దరు మృత్యువాత పడ్డారు. అవి మెషినరీ ప్రమాదాలే. సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో కాంట్రాక్టర్లు, వారిపై నిఘా పెట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపాయి.
కుంగుబాటు విషయానికొస్తే, హైద్రాబాద్‌లా కాదు.. అమరావతి భూమి కాస్త భిన్నమైనది. అక్కడ భవనాల పటిష్టత విషయంలో ఏమాత్రం రాజీ పడటానికి వీల్లేదు. ఒకటికి పదిసార్లు పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపి, నిర్మాణాల్ని జాగ్రత్తగా చేపట్టాల్సి వుంటుంది. ఇక్కడ తొందరపాటు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. కానీ, దురదృష్టవశాత్తూ అనుకున్న సమయానికే పూర్తి చేసేయాలన్న ప్రభుత్వ డెడ్‌లైన్‌తో పనులు 'హర్రీబర్రీ'గా జరిగితే పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. అనుకున్న సమయానికి ఓ నెల అటు, ఇటు జరిగితే నష్టమేముంది.? ఆన్న ఆలోచన ప్రభుత్వం చేస్తే అసలు సమస్యే ఉత్పన్నం కాదు కదా.!
ఏదిఏమైనా, అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా ఆంధ్రప్రదేశ్ గుండె గతుక్కుమంటుంది. అందుకే, ఏ చిన్న విషయంలోనూ అజాగ్రత్త పనికిరాదు. అదే సమయంలో, ఎప్పటికప్పుడు ప్రజల అనుమానాల్ని నివృత్తి చేసేలా ప్రభుత్వం చేపట్టే చర్యలుండాలి. పేరుకి తాత్కాలిక సచివాలయమే అయినా, భవిష్యత్తులో ఓ మహా నగరానికి పునాది ఇది. సో, ఎక్కడా ఎలాంటి అవాఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా వుండాలనే ఆశిద్దాం.