70 వేల కోట్ల ప్యాకేజీ.. నిజమేనా.?

'మేధావి' చలసాని శ్రీనివాస్‌, ఆంధ్రప్రదేశ్‌కి 70 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకునేందుకు యత్నిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టు, వెనుక బడ్డ జిల్లాల అభివృద్ధి ప్యాకేజీ.. ఇవేమీ ఇవ్వకుండా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ఊరుకోవాలన్నది కేంద్రం వ్యూహమని చలసాని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించడం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అంతా షాక్‌కి గురయ్యారు. 

సమైక్య ఉద్యమంలో చలసాని శ్రీనివాస్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చాలా సందర్భాల్లో ఆయన ప్రవర్తన 'విపరీతం'గానే కనిపించేది. చంద్రబాబుకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ, సమైక్య ఉద్యమాన్ని ఆయనే నీరుగార్చారన్న ఆరోపణలూ లేకపోలేదు. అడపా దడపా మీడియాలో కనిపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ గురించి 'అతి'గా మాట్లాడేస్తూ, పాపులర్‌ అయిన 'మేధావి' చలసానికి కేంద్రం నుంచి లీక్‌ ఎలా వచ్చిందబ్బా.? అన్నదే ఇప్పుడందరికీ డౌట్‌. 

చంద్రబాబు చైనా పర్యటన ముగించుకుని, ఢిల్లీకి వెళుతున్నారు. పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమవుతారు. షెడ్యూల్‌ ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కూడా చంద్రబాబు కలవనున్నారు. ఈ సందర్భంగానే ప్యాకేజీపై జైట్లీ నుంచి ప్రకటన వస్తుందన్నది చలసాని శ్రీనివాస్‌ అంచనా. అయితే, 70 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం వుందా.? అని ఆలోచిస్తే, అంత సీన్‌ లేదనే చెప్పొచ్చు. 

ఇప్పటికే లక్షా డెబ్భయ్‌ వేల కోట్ల రూపాయలు కేంద్రానికి ఇచ్చేశామంటూ ఏపీ బీజేపీ నేతలే కాదు, ఢిల్లీ స్థాయి బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. ఆ వ్యాఖ్యల్ని చంద్రబాబు సహా, ఏపీకి చెందిన నేతలు.. పార్టీలకతీతంగా ఖండించి పారేశారనుకోండి.. అది వేరే విషయం. వాస్తవానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతోనే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్యాకేజీ ప్రకటించాలి. కానీ, చంద్రబాబు పొలిటికల్‌ ప్యాకేజీ ముందు.. ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్యాకేజీ అటకెక్కేసిందన్నది నిర్వివాదాంశం. 

ఇదిలా వుంటే, చంద్రబాబుకి సైతం కేంద్రం ఇచ్చే ప్యాకేజీపై సమాచారం లేదనీ, చలసానికి ఈ విషయం ఎలా లీకయ్యిందని తెలుగు తమ్ముళ్ళు కూడా తలపట్టుక్కూర్చుంటున్నారు. ఢిల్లీలో వున్న చంద్రబాబు, ఈలోగా అఖిల పక్షాన్ని ప్రిపేర్‌ చేసి, ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నది చలసాని సూచన. ఈ సూచన బాగానే వుందిగానీ, అమలయ్యేనా.? అసంటూ కేంద్రానికి ప్యాకేజీ ఆలోచన వుందా.? అన్నిటికీ మించి, కేంద్రం ఇచ్చినా.. తెచ్చే సత్తా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వుందా.? ఏమో, డౌటే.!

Show comments