'విదేశీ' బాబుకు 'తెలుగు' గోడు వినిపిస్తుందా?

'ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపుగాదు'...అన్నాడో కవి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటివాడే. కొన్ని విషయాల్లో ఎంత మొత్తుకున్నా ఆయన ధోరణి మారదు. చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఎలా ఉంటుందో తెలుగు భాష విషయంలో చంద్రబాబు  దగ్గర ఆవేదన చెందినా అలాగే ఉంటుంది. తెలంగాణ సంగతి అలా పక్కనుంచితే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష దుస్థితి గురించి, దాని పట్ల చంద్రబాబు నిర్లక్ష్యం గురించి తీవ్రంగా ఆవేదన చెందుతున్నవారిలో ప్రముఖ హిందీ, తెలుగు పండితుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ప్రధానంగా కనబడుతున్నారు. 

ఆయనవంటి ఆవేదన చాలామందికి ఉండొచ్చుగాని బహిరంగంగా ఆవేదన చెందుతున్న, బాబును విమర్శిస్తున్న వ్యక్తి ఈయనే కనబడుతున్నారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషా పరిరక్షణ సమితి తరపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని యార్లగడ్డ చెప్పారు. ఇలాంటి పనులు చేయడం మంచిదే. కాని భాషాభివృద్ధి, పరిపాలనలో దాన్ని అమలు చేయడం మొదలైనవన్నీ కొందరు వ్యక్తులు చేయడం సాధ్యం కాదు. అది పాలకులే చేయాలి. తెలుగును కాపాడుకునేందుకు కృషి చేస్తామని యార్లగడ్డ చెబుతున్నా ప్రభుత్వ సహకారం లేనిదే సాధ్యం కాదు. చంద్రబాబు ఆ సహకారం ఇవ్వరని అర్థమైపోయింది. 

ప్రాథమికంగా ఆయనకు తెలుగు పట్ల ఆసక్తి లేదు. ప్రస్తుత ప్రపంచీకరణలో బోధనా భాషగా తెలుగు పనికిరాకుండా పోయింది. చివరకు పాలనలోనూ దానికి చోటు లేకుండా పోతోంది. ప్రజల భాషలో పరిపాలన జరగాలన్న ప్రాథమిక సూత్రాన్ని పాలకులు ఏనాడో తుంగలో తొక్కారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క శిలాఫలకం తెలుగులో ఉన్న దాఖలాలు కనబడటంలేదని భాషాభిమానులు విమర్శిస్తున్నారు. అది వాస్తవమే. ఏపీ రాజధానికి అమరావతి అనే పేరు పెడుతున్నట్లు బాబు ప్రకటించినప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమైంది. 

అమరావతికి పూర్వవైభవం తెస్తామని, తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని, తెలుగుదనం ఉట్టిపడేలా రాజధాని నిర్మిస్తామని...ఇలా అనేక కల్లబొల్లి కబుర్లు వినిపించారు చంద్రబాబు. కాని ఆయన విదేశీ మోజు ముందు తెలుగుదనం సోదిలోకి లేకుండాపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో తెలుగు శిలాఫలకాల జాడ లేదు.  ఆహ్వాన పత్రికల్లోనూ తెలుగుకు చోటు లేదు. దీనిపై భాషాభిమానులు తీవ్రంగా ఆవేదన చెందారు. చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన యార్లగడ్డ తెలుగులో శిలాఫలకాలు తయారుచేయించి వాటిని ఏర్పాటు చేయించాలని కోరుతూ సీఆర్‌డీఏకు అందచేశారు. చంద్రబాబు కూడా అంగీకరించారు. ఇది జరిగి చాలాకాలమైపోయింది.  Readmore!

ప్రస్తుతం ఆ శిలాఫలకాలు సీఆర్‌డీఏ కార్యాలయం కారుషెడ్డులో దుమ్మ కొట్టుకొని పడున్నాయి. తెలుగుపై బాబుకు ఉన్న ఆసక్తికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? జపనీస్‌, చైనీస్‌, జర్మన్‌ మొదలైన విదేశీ భాషలు నేర్చుకోవాలని, అవి నేర్చుకుంటేనే ఉద్యోగాలు దొరుకుతాయని యువతకు పిలుపునిస్తున్న బాబు తెలుగును చెత్తలో పడేయకుండా నెత్తికెక్కించుకుంటారని ఎలా అనుకుంటాం? అచ్చమైన తెలుగు రాష్ట్రంలో తెలుగు కోసం ఆవేదన. అమ్మ భాష కోసం వెదుకులాట. అమ్మను ఇంట్లోనే పెట్టుకొని ఆమె కోసం వెదుక్కుంటున్న పరిస్థితి. ఇది విచిత్రమే కాదు. విషాదం కూడా. ఏ రాష్ట్రంలోనూ, ఏ దేశంలోనూ ఈ దుస్థితి ఉండకపోవచ్చు. 

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యార్లగడ్డ తెలుగు అమలు కోసం వేడుకుంటూనే ఉన్నారు. తెలుగు భాష అమలు కోసం చంద్రబాబు హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తామని టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఏదో మాట వరసకు అన్నట్లుగా మేనిఫెస్టోలో చేర్చిందిగాని బాబుకు ఆసక్తి ఉంటేగదా...! భాష విషయంలో తమిళనాడులో, కర్నాటకలో పాలకులు ప్రజలకు భయపడతారు. కాని తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ యథా పాలకులు తథా ప్రజలు. 

ఏళ్ల తరబడి కోర్టులో పోరాడి తెలుగుకు ప్రాచీన భాష హోదా సాధించాం. అయినా ఏమీ ప్రయోజనం లేదు. చంద్రబాబుకు టెక్నాలజీ పట్ల ఉన్నంత ఆసక్తి భాష పట్ల లేదు. సెల్‌ ఫోన్‌ ద్వారా పరిపాలన సాగించాలనే ఉత్సాహం ప్రజల భాషలో పరిపాలన చేయడం మీద లేదు.  తాను ఎన్టీఆర్‌ వారసుడినని, ఆయన ఆశయాలు కొనసాగిస్తామని జయంతి, వర్ధంతి రోజుల్లో ప్రతిజ్ఞ చేస్తుంటారు. కాని తెలుగు భాషపై ఆయనకున్న ప్రేమలో ఈయనకు అణువంత కూడా లేదు. ఆయన చేసిన సేవలో ఈయన రవ్వంత కూడా చేయడంలేదు. 

Show comments

Related Stories :